శ్రీనగర్: భారత ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ అనుకోకుండా నియంత్రణ రేఖ (ఎల్వోసీ)ను దాటింటి. పాకిస్థాన్‌లో అది ల్యాండ్ అయ్యింది. (Army’s tactical drone) ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ డ్రోన్‌ను పాకిస్థాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ సాధారణ నిఘా మిషన్‌లో పాల్గొన్నది. అయితే కంట్రోల్ కోల్పోయిన ఆ డ్రోన్ నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ను దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించింది. అక్కడ దిగిన ఆ డ్రోన్‌ను పాకిస్థాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) స్థాయి అధికారులతో ఇండియన్ ఆర్మీ అధికారులు ఈ సంఘటనపై చర్చలు జరుపనున్నట్లు తెలుస్తున్నది.
కాగా, ఇటీవల ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన యుద్ధ విమానం అనుకోకుండా ట్రైనింగ్ బాంబ్‌ను జారవిడిచింది. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. సాంకేతిక కారణం వల్ల ప్రాక్టీస్ బాంబు పాక్ సరిహద్దు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో పడి పేలినట్లు ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరుగలేదని చెప్పారు. ప్రాక్టీస్ బాంబ్ అనుకోకుండా విడుదల కావడానికి దారితీసిన సాంకేతిక సమస్యను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.