అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున బంగారు పతకం సాధించడం ఎంత గొప్ప విషయం? మొన్నామధ్య అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాను దేశంలోని ప్రభుత్వాలు ఎలా సత్కరించాయో తెలిసిందే. చెస్‌లో విషీ ఆనంద్, హంపి వంటి వారి విజయాలను గుర్తించిన ప్రభుత్వాలు అవార్డులు అందిస్తాయి. కానీ పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఒక చెస్ క్రీడాకారిణి విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
ఆమె పేరు మల్లికా హండా. డెఫ్ స్పోర్ట్స్ (చెవిటివారి క్రీడ) చెస్‌లో భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి పెట్టిందామె. అంతేకాదు, వరల్డ్, ఆసియన్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆరు పతకాలు సాధించింది. జాతీయ స్థాయిలో నేషనల్ చెస్ ఛాంపియన్స్‌ను ఏడుసార్లు గెలుచుకుంది. ఇన్ని సాధించిన మల్లికకు పంజాబ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు.
ఇదేంటని ప్రశ్నిస్తే.. డెఫ్ స్పోర్ట్స్‌కు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి పాలసీ లేదని అధికారులు కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఏం చేయాలో తెలియని ఆమె.. తన ఆగ్రహాన్ని, బాధను సైన్ లాంగ్వేజ్‌లో చెప్పుకుంటూ ఒక వీడియో చేసింది. చిన్నతనం నుంచి చెవిటి వారైతే మాటలు రావడం కూడా జరగదు.
ఎందుకంటే అక్షరాలను ఎలా పలకాలో వాళ్లు వినలేరు కదా. అందుకే మల్లిక ఇలా సైన్ లాంగ్వేజ్‌లో తన ఆవేదనను వెళ్లగక్కింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వ్యక్తి.. ఇలాంటి సమయంలోనే క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇలాంటి క్రీడాకారిణులను ఆదుకోవాలని కోరారు.
ఈ ట్వీట్ అటు తిరిగి, ఇటు తిరిగి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. పరిస్థితిని గమనించిన ఆయన ‘‘ఈ యువ ఛాంపియన్ వివరాలు తెలియజేయండి. నేను వ్యక్తిగతంగా చేతనైన సాయం చేస్తాను’’ అని ట్వీట్ చేశారు.
Please pass on the young champion’s details if you can. I will contribute in my personal capacity https://t.co/iZLaCllw2P
— KTR (@KTRTRS) January 3, 2022