హైదరాబాద్, ఆక్టోబర్ 19 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి ఔదార్యాన్ని చాటారు. జాతీయస్థాయిలో మెరిసి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఇక్కట్లు పడుతున్న నిరుపేద క్రీడాకారిణికి భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్న తెలంగాణ బిడ్డ, పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు ఆర్థికంగా అండగా నిలిచారు. శ్రీలంక చాంపియన్‌షిప్‌నకు వెళ్లేందుకు ప్రయాణ, వసతి ఇతరత్రా ఖర్చులు భరించేందుకు పెద్దమనసుతో ముందుకువచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన అర్చన కుట్టుపనిచేస్తూ జీవనం సాగిస్తున్నది. దివ్యాంగురాలైనప్పటికీ మొక్కవోని పట్టుదలతో పారా త్రోబాల్‌లో రాణిస్తున్నది. ఇటీవల జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటడంతో పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరగనున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఎంపికచేసింది.
అయితే ప్రయాణ, ఇతరత్రా ఖర్చులు భరించే స్థోమతలేక నిస్సహాయ స్థితిలో చిక్కుకున్నది. ఈ క్రమంలో స్థానిక నేతలు, మిత్రుల సహాయంతో కుటుంబసభ్యులు వెంటరాగా ఆదివారం కేటీఆర్‌ను నందినగర్‌లోని నివాసంలో కలిశారు. శ్రీలంక చాంపియన్షిప్నలో పాల్గొనేందుకు ఆర్థిక సహకారం అందించాలని అర్థించారు. వెంటనే చలించిపోయిన కేటీఆర్ వ్యక్తిగతంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆమె ప్రయాణ, క్రీడాఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే చాంపియన్‌షిప్‌నకు సిద్ధమయ్యేందుకు అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘అర్చన కథ ధైర్యం, పట్టుదలకు నిదర్శనం. చంద్రంపేటలో ఒక కుట్టుమిషన్ నుంచి అంతర్జాతీయ వేదికకు చేరుకోవడం స్ఫూర్తిదాయకం. తెలంగాణ ఆమెను చూసి గర్విస్తున్నది. రాష్ర్టానికే కాకుండా దేశానికీ గర్వకారణంగా నిలిచేందుకు ఆమెకు అవసరమైన సాయం అందిస్తాం’ అని భరోసా ఇచ్చారు.