Krishan Bahadur Pathak | ఢిల్లీ: సుమారు రెండు దశాబ్దాల పాటు భారత హాకీ జట్టుకు గోల్ కీపర్‌గా సేవలందించి ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికిన పీఆర్ శ్రీజేష్ స్థానాన్ని క్రిషన్ బహదూర్ పాఠక్ భర్తీ చేయనున్నాడు. సెప్టెంబర్ 8 నుంచి 17 దాకా చైనా వేదికగా జరుగబోయే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన 18 మంది జట్టు సభ్యులలో గోల్‌కీపర్‌గా పాఠక్ ఎంపికయ్యాడు. శ్రీజేష్ స్థానాన్ని పాఠక్.. ఏ మేరకు భర్తీ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
భారత హాకీ జట్టుతో 18 ఏండ్లుగా కొనసాగుతున్న దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు. గోల్ పోస్ట్ వద్ద ప్రత్యర్థులు యత్నించిన గోల్స్‌ను పెట్టని గోడలా అడ్డుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అతడు.. పారిస్ ఒలింపిక్స్ ముగిశాక ఆట నుంచి రిటైర్ కానున్నట్టు జూలై 23న ప్రకటించాడు. విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపాడు. 36 ఏండ్ల ఈ మాజీ సారథి 2006 నుంచి భారత జట్టుతో కొనసాగుతూ ఇప్పటిదాకా 328 మ్యాచ్‌లు ఆడాడు. ‘పారిస్ ఒలింపిక్స్‌తో నా సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికేందుకు సిద్ధమయ్యా. ఈ అద్భుత ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కుటుంబానికి, సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, హాకీ ఇండియాకు కృతజ్ఞతలు. పారిస్‌లో భారత్‌కు పతకం తెచ్చేందుకు మా అత్యుత్తమ ప్రదర్శనను చేస్తాం. పతకం రంగు మార్చడానికి ప్రయత్నిస్తాం’ అని తెలిపాడు.
2004లోనే భారత జూనియర్ హాకీ జట్టులోకి వచ్చిన శ్రీజేష్.. 2006లో కొలంబో వేదికగా జరిగిన సౌత్ఏషియన్ గేమ్స్ సందర్భంగా సీనియర్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అయితే కెరీర్ తొలినాళ్లలో జట్టులోకి వస్తూ పోతూ సాగిన శ్రీజేష్ ప్రయాణం.. 2011 తర్వాత కొలిక్కివచ్చింది. అప్పట్నుంచి అతడు భారత జట్టులో రెగ్యులర్ గోల్‌కీపర్ అయ్యాడు. టీమ్ఇండియా సాధించిన పలు చారిత్రాత్మక విజయాలలో సభ్యుడిగా ఉన్న శ్రీజేష్.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులోనూ సభ్యుడు. 41 ఏండ్ల తర్వాత హాకీలో కాంస్యం నెగ్గిన మ్యాచ్‌లో శ్రీజేష్.. జర్మనీ ఆటగాళ్లు కొట్టిన బంతులకు అడ్డుగోడగా నిలబడి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా శ్రీజేష్ రిటైర్మెంట్ నేపథ్యంలో పారిస్ ఒలింపిక్స్‌లో అతడి కోసం ఆడి పతకం సాధిస్తామని కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.