ఓపెనర్లు రాణించినా.. మిడిలార్డర్ ప్రభావం చూపకపోవడంతో ముంబై ఇండియన్స్ ఓ మోస్తారు స్కోరుకు పరిమితమైతే.. యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) అలవోక విజయం సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిన రోహిత్ సేనకు ఇది వరుసగా రెండో పరాజయం కాగా.. కోల్‌కతాకు వరుసగా రెండో విజయం.
అబుదాబి: కట్టుదిట్టమైన బౌలింగ్‌కు.. మెరుపు బ్యాటింగ్ తోడవడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన పోరులో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (33) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (42 బంతుల్లో 74 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. సునీల్ నరైన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. గురువారం పోరులో సాధికారికంగా ఆడాడు. డికాక్‌తో కలిసి జట్టుకు మెరుగైన ఆరంభాన్నిచ్చాడు. ఈ జోడీ చక్కటి సమన్వయంతో మందుకు సాగడంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (5) పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. ఇషాన్ కిషన్ (14) పొలార్డ్ (21), కృనాల్ (12) జట్టు స్కోరును 150 దాటించారు. మిడిల్ ఓవర్లలో సునీల్ నరైన్ (1/20), వరుణ్ చక్రవర్తి (0/22) కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు.
లక్ష్యఛేదనలో కోల్‌కతాకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ (13; 1 ఫోర్, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో మూడు ఓవర్లు ముగిసేసరికి నైట్‌రైడర్స్ 40 పరుగులు చేసింది. బుమ్రా చక్కటి బంతితో గిల్‌ను ఔట్ చేసినా.. వెంకటేశ్‌కు రాహుల్ త్రిపాఠి జతవడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో 25 బంతుల్లో తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ తన పేరిట రాసుకున్న వెంకటేశ్‌ను బుమ్రా బుట్టలో వేసుకున్నాడు. అయినా త్రిపాఠి ఏమాత్రం తగ్గకపోవడంతో లక్ష్యం మంచులా కరిగింది. బుమ్రా ఓవర్లో 6,4 అరుసుకున్న త్రిపాఠి.. రాహుల్ చాహర్‌కు అదే శిక్ష వేశాడు. మోర్గాన్ (7) ఎక్కువసేపు నిలువలేకపోయినా.. త్రిపాఠి పని పూర్తిచేశాడు.
ముంబై: రోహిత్ (సి) గిల్ (బి) నరైన్ 33, డికాక్ (సి) నరైన్ (బి) ప్రసిద్ధ్ 55, సూర్యకుమార్ (సి) కార్తీక్ (బి) ప్రసిద్ధ్ 5, ఇషాన్ (సి) రస్సెల్ (బి) ఫెర్గూసన్ 14, పొలార్డ్ (రనౌట్) 21, కృనాల్ (సి) వెంకటేశ్ (బి) ఫెర్గూసన్ 12, సౌరభ్ (నాటౌట్) 5, మిల్నే (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 155/6. వికెట్ల పతనం: 1-78, 2-89, 3-106, 4-119, 5-149, 6-149, బౌలింగ్: రాణా 1-0-5-0, వరుణ్ 4-0-22-0, నరైన్ 4-0-20-1, ఫెర్గూసన్ 4-0-27-2, ప్రసిద్ధ్ 4-0-43-2, రస్సెల్ 3-0-37-0.
కోల్‌కతా: గిల్ (బి) బుమ్రా 13, వెంకటేశ్ (బి) బుమ్రా 53, త్రిపాఠి (నాటౌట్) 74, మోర్గాన్ (సి) బౌల్ట్ (బి) బుమ్రా 7, రాణా (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 15.1 ఓవర్లలో 159/3. వికెట్ల పతనం: 1-40, 2-128, 3-147, బౌలింగ్: బౌల్ట్ 2-0-23-0, మిల్నే 3-0-29-0, బుమ్రా 4-0-43-3, కృనాల్ 3-0-25-0, రాహుల్ చాహర్ 3-0-34-0, రోహిత్ 0.1-0-4-0.