బెంగళూరు : స్టార్లతో కొత్త కళను సంతరించుకున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే టోర్నీలో మునుపెన్నడూ లేని విధంగా తొలిరోజే రికార్డులతో ఘనంగా మొదలైంది. బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన తొలిరోజు ఏకంగా 22 సెంచరీలు నమోదవడం గమనార్హం. సుదీర్ఘ కాలం తర్వాత ఈ టోర్నీ ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శతకాలతో తమ పునరాగమనాన్ని ఘనంగా చాటారు. పాలబుగ్గల పసివాడు వైభవ్ సూర్యవంశీ అయితే అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై పిడుగులా విరుచుకుపడి బీహార్‌కు రికార్డు స్కోరును అందించాడు. దొరికిన బంతిని దొరికనట్టుగా బౌండరీ లైన్ దాటించి రికార్డుల దుమ్ము దులిపాడు. ప్లేట్, ఎలైట్ డివిజన్స్ తేడా లేకుండా బ్యాటర్లు.. బౌలర్లకు తొలిరోజే పీడకలను మిగిల్చారు.
జట్టులో ‘స్టార్’ సంస్కృతిని పక్కనబెట్టి బోర్డుతో కాంట్రాక్టులున్న ప్రతి ఆటగాడు విజయ్ హజారే ఆడాలన్న బీసీసీఐ నిబంధనతో సుదీర్ఘకాలం తర్వాత ఈ టోర్నీ ఆడిన రోహిత్, కోహ్లీ.. ఇటీవల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ల్లో ఫామ్‌ను కొనసాగించారు. జైపూర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్.. (94 బంతుల్లో 155, 18 ఫోర్లు, 9 సిక్స్‌లు) తన కెరీర్లో 37వ లిస్ట్ ఏ శతకాన్ని నమోదుచేశాడు. 28 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన ‘ముంబై చ రాజా’.. 61 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. ఏడేండ్ల తర్వాత ఈ టోర్నీ ఆడుతున్న హిట్‌మ్యాన్‌ను చూసేందుకు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి ప్రేక్షకులు పోటెత్తారు. రోహిత్ రాకతో సుమారు 80 శాతం స్టేడియం నిండిపోవడం విశేషం.హిట్‌మ్యాన్ దూకుడుతో సిక్కిం నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ముంబై 30.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తిచేసింది.
బెంగళూరులో ఆంధ్రాతో ఆడిన మ్యాచ్‌లో కోహ్లీ (101 బంతుల్లో 131, 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సైతం అదరగొట్టాడు. సఫారీలతో సిరీస్‌లో అభిమానులకు మునపటి కోహ్లీని పరిచయం చేసిన విరాట్.. 15 ఏండ్ల తర్వాత ఈ టోర్నీ ఆడుతూ శతకంతో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 58వ సెంచరీ చేసిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో శతకంతో పాటు వన్డేల్లో అత్యంత వేగంగా 16 వేల పరుగుల మార్కును దాటిన బ్యాటర్ (330 ఇన్నింగ్స్)గా సచిన్ టెండూల్కర్ (391 ఇన్నింగ్స్) రికార్డును అధిగమించాడు. ఢిల్లీ బౌలర్ సిమర్జిత్ సింగ్ (5/54) ఐదు వికెట్లతో రాణించగా మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్రా.. 50 ఓవర్లకు 289/8 స్కోరు చేసింది. ఛేదనలో కోహ్లీతో పాటు నితీశ్ రాణా (77), ప్రియాన్ష్ ఆర్య (74) రాణించారు.
జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్నాటక అద్భుతమే చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్.. నిర్ణీత ఓవర్లలో 412/9 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 125, 7 ఫోర్లు, 14 సిక్స్‌లు) రెచ్చిపోగా విరాట్ (88), కుశాగ్ర (63) అర్ధశతకాలతో రాణించారు. భారీ ఛేదనను కర్నాటక మరో 15 బంతులు మిగిలుండగానే పూర్తిచేయడం విశేషం. దేవ్‌దత్ పడిక్కల్ (118 బంతుల్లో 147, 10 ఫోర్లు, 7 సిక్స్‌లు), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (54), అభినవ్ మనోహర్ (56*), ప్రభాకర్ (40*) దూకుడుగా ఆడి కర్నాటకకు రికార్డు విజయాన్ని కట్టబెట్టారు. లిస్ట్ ఏ క్రికెట్లో ఇదే రికార్డు ఛేదన.

బ్యాటర్ల హవా సాగిన తొలిరోజు 22 మంది బ్యాటర్లు మూడంకెల స్కోరును అందుకోవడమే (2021, 2025 సీజన్లో ఒకేరోజు 19 సెంచరీలు నమోదయ్యాయి) ఓ రికాైర్డెతే ఇందులో ముగ్గురు మాత్రం కండల్లో కరెంట్ నింపుకున్నట్టే ఆడారు. వైభవ్, సకిబుల్, ఇషాన్ అత్యంత వేగంగా శతకాలు చేసిన జాబితాలో ఒకరి రికార్డును మరొకరు పోటీపడి మరీ బద్దలుకొట్టారు. ముందు వైభవ్.. 36 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టిస్తే అదే మ్యాచ్‌లో సకిబుల్ 32 బంతుల్లోనే వైభవ్ రికార్డును అధిగమించాడు. కొద్దిసేపటికే కర్నాటకతో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్.. 33 బంతుల్లో ఈ ఘనతను అందుకుని వైభవ్‌ను మూడోస్థానానికి నెట్టాడు.
బరిలోకి దిగితే రికార్డుల లెక్కలు సరిచేస్తున్న బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ (84 బంతుల్లో 190, 16 ఫోర్లు, 15 సిక్స్‌లు) మరోసారి విధ్వంసం సృష్టించాడు. రాంచీ వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్.. 36 బంతుల్లోనే సెంచరీ సాధించడంతో పాటు 59 బంతుల్లో 150 రన్స్ మార్కును అందుకున్నాడు. తృటిలో ద్విశతకం చేజారినా.. వన్డేల్లో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డు (వెస్టిండీస్‌పై 64 బంతుల్లో 150) మాత్రం తుడిచిపెట్టుకుపోయింది. ఈ సెంచరీతో వైభవ్.. లిస్ట్ ఏ క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడి (14 ఏండ్ల 272 రోజులు)గా రికార్డులకెక్కాడు. వైభవ్‌తో పాటు కెప్టెన్ సకిబుల్ గని (40 బంతుల్లో 128*, 10 ఫోర్లు, 12 సిక్స్‌లు) రికార్డు సెంచరీ, అయుశ్ లొహరు (116) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో బీహార్ ఏకంగా 574/6 పరుగుల రికార్డు స్కోరు చేసింది. లిస్ట్ ఏ క్రికెట్లో ఇదే అత్యధిక స్కోరు. ఛేదనలో అరుణాచల్.. 177 పరుగులకే కుప్పకూలడంతో బీహార్ 397 పరుగుల భారీ విజయాన్ని నమోదుచేసింది.