న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా బయోబబుల్‌లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్‌కు రెస్ట్ ఇవ్వాలని సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరుగనున్న మూడో టీ20తో పాటు.. శ్రీలంకతో ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న పొట్టి సిరీస్ నుంచి ఈ ఇద్దరికి విరామం ఇచ్చింది. దీంతో పది రోజుల పాటు ఈ ఇద్దరు ఆటగాళ్లు కుటుంబసభ్యులతో గడపనున్నారు. వచ్చే నెల 4 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కోహ్లీ, పంత్ తిరిగి జట్టుతో చేరనున్నారు. ‘కోహ్లీ, పంత్ శనివారమే ఇంటికి బయలుదేరారు. విండీస్‌పై ఇప్పటికే టీమ్ఇండియా సిరీస్ చేజిక్కించుకోగా.. లంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వీరు అందుబాటులో ఉండరు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ఆటగాళ్లకు బ్రేక్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. పనిభారంతో పాటు బయో బబుల్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ దీన్ని వర్తింపచేస్తాం’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. మొహాలీ వేదికగా లంకతో జరుగనున్న మ్యాచ్.. కోహ్లీకి వందో టెస్టు కానుండటంతో అతడిని తాజాగా ఉంచేందుకు ఈ బ్రేక్ ఉపయోగ పడుతుందని బోర్డు యోచిస్తున్నది.