భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్కు అంతా సిద్ధమైంది. భారత ఆటగాళ్లంతా తమ తమ పాత్రలపై పూర్తి స్పష్టత ఉందంటున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా జట్టులో తన పాత్ర ఏంటో తనకు తెలుసునని చెప్పాడు. మొహాలీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20కి ముందు మీడియాతో రాహుల్ మాట్లాడాడు.
ఈ సందర్భంగా రాహుల్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా (140.91) ఉండటాన్ని విలేకరులు ఎత్తిచూపారు. దీనికి బదులిచ్చిన రాహుల్.. ఏ ఆటగాడు కూడా తన స్ట్రైక్ ఎంత ఉండాలి? అనుకుంటూ ఆడడని, జట్టు గెలవాలంటే ఏం చెయ్యాలని మాత్రమే చూస్తాడని చెప్పాడు. ‘అవసరమైతే 200 స్ట్రైక్ రేట్ ఆడతారు. పర్లేదు అనుకుంటే 120-130 రేటుతో ఆడతారు. వీటి గురించి ఎవరూ అనాలసిస్ చేసుకోరు.
అయినా నేను కూడా ఈ విషయంపై ఫోకస్ పెట్టాను. గడిచిన ఏడాదిలో జట్టులో మా పాత్ర ఏంటనే విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది. ఆ పాత్రకు న్యాయం చెయ్యడానికి అందరం కృషి చేస్తున్నాం. బ్యాటింగ్ చేయడానికి ఎప్పుడు వెళ్లినా ప్రభావవంతంగా కనిపించడానికి, జట్టు కోసం మరింత మెరుగవడానికి నేను ప్రయత్నిస్తున్నా’ అని రాహుల్ వెల్లడించాడు.