నార్తాంప్టన్: ఇంగ్లండ్ లయన్స్‌తో ప్రారంభమైన రెండో అనధికార టెస్టులో.. ఇండియా ఏ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ నమోదు చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ 151 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అతను 168 బంతుల్లో 116 రన్స్ చేసి నిష్క్రమించాడు. అనధికార టెస్టు తొలి మ్యాచ్‌కు దూరమైన రాహుల్.. రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చేశాడు. అయితే వచ్చీరాగానే అతను సెంచరీతో కదంతొక్కడం విశేషం. ఆరంభంలో ఇండియన్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. జైస్వాల్ 27 రన్స్ చేసి నిష్క్రమించాడు. అభిమన్యు ఈశ్వరన్ 11 రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే మూడో వికెట్‌కు కరుణ్ నాయర్‌తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ ఇద్దరి మధ్య మూడో వికెట్ 86 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. తొలి అనధికార టెస్టులో అద్భుతమైన రీతిలో డబుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్.. రెండో మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 71 బంతుల్లో 40 రన్స్ చేసి ఔటయ్యాడు.
రెండో టెస్టు తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం ఏర్పడింది. వాన వల్ల కొన్ని ఓవర్లు వేయలేదు. అయినా 83 ఓవర్ల ఆట ముగిసే వరకు ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 319 రన్స్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా రాహుల్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. ఇంగ్లండ్ సీనియర్ జట్టుతో జరగబోయే టెస్టు సిరీస్‌లో రాహుల్ కీలక ప్లేయర్‌గా మారనున్నాడు. సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడంతో వారి స్థానాన్ని భర్తీ చేసే బాధ్యత రాహుల్‌పైనే ఉన్నది. భారత బ్యాటర్లలో జురెల్ 52 రన్స్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ మూడు, హిల్ రెండు వికెట్లు తీసుకున్నారు.