కోల్‌కతా బౌలర్లు చివర్లో విజృంభించడంతో గుజరాత్ టైటన్స్ అనుకున్నంత స్కోరు చెయ్యలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ (7)ను టిమ్ సౌథీ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా (25), హార్దిక్ పాండ్యా (67) ఆ జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.
అయితే ఉమేష్ యాదవ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. సాహాను అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపు డేవిడ్ మిల్లర్ (27) అలరించినా.. శివమ్ మావి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. తర్వాతి ఓవర్లోనే పాండ్యా, వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ (0)ను సౌథీ పెవిలియన్ చేర్చాడు. ఇక చివరి ఓవర్లో బంతి అందుకున్న ఆండ్రీ రస్సెల్ నిప్పులు చెరిగాడు.
ఆ ఓవర్లో కేవలం ఐదు పరుగులే ఇచ్చి రాహుల్ తెవాటియా (17), అభినవ్ మనోహర్ (2). లోకీ ఫెర్గూసన్ (0), యష్ దయాల్ (0) వికెట్లు తీశాడు. దాంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 4, సౌథీ 3 వికెట్లతో చెలరేగగా.. ఉమేష్ యాదవ్, శివమ్ మావి చెరో వికెట్ తీసుకున్నారు.