Ashes Series : యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Australia) పోరాడుతోంది. 143కే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(54) మరోసారి అర్ధ శతకంతో ఆదుకున్నాడు. కామెరూన్ గ్రీన్(21)తో ఖవాజా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్.. 180/5. ఆ జట్టు విజయానికి ఇంకా 101 పరుగులు కావాలి.
వర్షం కారణంగా ఐదో రోజు ఆట లంచ్ తర్వాత మొదలైంది. కాసేపటికే ఇంగ్లండ్ బౌలర్లు నైట్‌వాచ్‌మన్ స్కాట్ బోలాండ్(20), ట్రావిస్ హెడ్(16)ను ఔట్ చేశారు. దాంతో, ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లేది ఎవరు? లేదా డ్రాగా ముగుస్తుందా? అనేది మరో సెషన్‌తో తేలిపోనుంది.
నాలుగో రోజు ఇంగ్లండ్ 273 ఆలౌటయ్యింది. నాథన్ లియాన్(Nathan Lyon), ప్యాట్ కమిన్స్(Pat Cummins) నాలుగేసి వికెట్లతో ఆతిథ్య జట్టను వణికించారు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్(36), ఉస్మాన్ ఖవాజా(34 నాటౌట్) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే.. వార్నర్‌ను ఔట్ చేసి రాబిన్సన్ ఇంగ్లండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ చెలరేగాడు. మార్నస్ లబూషేన్(13), స్టీవ్ స్మిత్(6)ను ఔట్ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఖవాజా, నైట్‌వాచ్‌మన్ స్కాట్ బోలాండ్(13) మరో వికెట్ పడకుండా ఆడారు.