నాగ్పూర్: సుదీర్ఘమైన చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ ఆడుతున్న కేరళ.. విదర్భతో జరుగుతున్న టైటిల్ పోరులో పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్లో విదర్భను 379 పరుగులకు ఆలౌట్ చేసిన కేరళ.. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తూ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్లో ఆ జట్టు ఇంకా 248 పరుగులు వెనుకబడి ఉంది. ఆదిత్య సర్వతె (66 నాటౌట్)తో పాటు కేరళ సారథి సచిన్ బేబీ (7 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
అహ్మద్ ఇమ్రాన్ (37)తో కలిసి మూడో వికెట్కు ఆదిత్య 93 పరుగులు జోడించి కేరళను ఆదుకున్నాడు. అంతకముందు 256/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్కు వచ్చిన విదర్భ.. ఓవర్ నైట్ స్కోరుకు మరో 123 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. తొలిరోజు సెంచరీ హీరో డానిష్ (153) మరో 15 పరుగులు జోడించి ఔట్ అవగా లోయరార్డర్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. మూడో రోజు కేరళ.. విదర్భ బౌలర్లను ఏ మేరకు అడ్డుకుంటుందనేదానిపై ఈ మ్యాచ్లో ఇరుజట్ల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.