Ranji Trophy | అహ్మదాబాద్: రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో కేరళ కొత్త చరిత్ర సృష్టించింది. 68 ఏండ్ల తమ రంజీ చరిత్రలో ఆ జట్టు తొలిసారి ఈ టోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించింది. 1957లో మొదటిసారి రంజీ అరంగేట్రం చేసిన కేరళ.. 2018-19 సీజన్లో సెమీస్ చేరడమే ఇప్పటిదాకా అత్యుత్తమ ప్రదర్శన. 2 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఆ జట్టు ఫైనల్‌కు చేరింది. 429/7 వద్ద ఐదో రోజు ఆట ఆరంభించిన గుజరాత్.. మరో 29 పరుగులు (కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోరు 457) చేస్తే ఫైనల్‌కు దూసుకెళ్లేది. కానీ కేరళ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆదిత్య సర్వతె అద్భుతం చేశాడు. ఓవర్ నైట్ బ్యాటర్లు సిద్ధార్థ్ దేశాయ్ (30), జయ్‌మీత్ పటేల్ (79) ఔట్ చేసిన అతడు.. 455 పరుగుల వద్ద నగ్వస్వల్ల (10)ను బోల్తా కొట్టించడంతో గుజరాత్ ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకుంది.
మ్యాచ్ డ్రాగా ముగిసినా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యంతో కేరళ టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఇక మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి విదర్భ షాకిచ్చింది. ఆట ఆఖరి రోజు 406 పరుగుల భారీ ఛేదనలో ముంబై 325 పరుగులకే ఆలౌట్ అయి 80 రన్స్ తేడాతో ఓడింది. శార్దూల్ (66), ములాని (46), మోహిత్ (34) ముంబైని కాపాడే యత్నం చేసినా విదర్భ బౌలర్ హర్ష్ దూబె (5/127) రాణించడంతో ఆ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. విదర్భ, కేరళ మధ్య ఈనెల 26 నుంచి ఫైనల్ మొదలుకానుంది.