హైదరాబాద్, ఆట ప్రతినిధి: బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ కోసం కరీంనగర్‌కు చెందిన యువ క్రికెటర్ కట్ట శ్రీవల్లి హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకుంది. శనివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో సమావేశమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సెలక్షన్ కమిటీ.. పదిహేను మందితో కూడిన జట్టును ప్రకటించగా అందులో శ్రీవల్లి సభ్యురాలిగా ఉంది.
బొమ్మకల్, శ్రీపురం కాలనీకి చెందిన కట్ట ఉమారాణి-లక్ష్మారెడ్డి దంపతులు చిన్న కూతురు అయిన శ్రీవల్లి.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ జట్టుకు ఎంపికైన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. శ్రీవల్లి ఎంపికవడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాభిమానులందరికీ గర్వకారణమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.