‘డియర్ క్రికెట్. గివ్ మీ వన్ మోర్ చాన్స్’.. 2022, డిసెంబర్ 10న కరుణ్ నాయర్ చేసిన ట్వీట్ ఇది. కట్‌చేస్తే.. మూడేండ్ల తర్వాత ఆదివారం ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లి స్టేడియంలో అతడు సృష్టించిన కళాత్మక విధ్వంసం అనంతరం ‘ఎక్స్’లో మరోమారు ఈ ట్వీట్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దేశ టెస్టు క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత రెండో త్రిశతకం సాధించినా.. జాతీయ జట్టులో మళ్లీ ఎందుకు చోటు దక్కలేదో ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగా మారిన కరుణ్‌కు ఇది ముమ్మాటికీ కమ్‌బ్యాక్ ఇన్నింగ్సే..
Karun Nair | ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.. ఆధునిక క్రికెట్లో ఈ ఇద్దరి బౌలింగ్ సామర్థ్యం, వారు సాధించిన ఘనతపై ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కానీ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ సృష్టించిన విధ్వంసం తర్వాత ‘వీళ్ల బౌలింగ్‌లో ఆడటం ఇంత తేలికా!’ అన్న భావన కలగక మానదు. ముంబై నిర్దేశించిన 206 పరుగుల ఛేదనలో స్కోరుబోర్డుపై పరుగులేమీ చేరకుండానే వికెట్ పడిపోయినా ‘ఇంప్యాక్ట్ ప్లేయర్’గా వచ్చిన కరుణ్.. ఆ పదానికి అసలైన నిర్వచనం ఇచ్చాడు. దిగ్గజ బ్యాటర్లు సైతం భారీ షాట్లు ఆడేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించే బుమ్రా బౌలింగ్‌లో 9 బంతులను ఎదుర్కున్న కరుణ్.. 3 బౌండరీలు, రెండు భారీ సిక్సర్లతో 26 పరుగులు రాబట్టాడు.
ముఖ్యంగా బుమ్రా ఆరో ఓవర్లో డీప్ బ్యాక్వర్డ్ స్కేర్, లాంగాఫ్ మీదుగా బాదిన సిక్సర్లు అయితే చూసి తీరాల్సిందే. కరుణ్ క్రీజులో ఉన్నంతసేపు హార్దిక్ మళ్లీ బుమ్రాకు బంతినివ్వలేదంటే కరుణ్ ఆట ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ ఫలితం గురించి పక్కనబెడితే.. ఢిల్లీ ఇన్నింగ్స్‌పై అతడు చూపిన ప్రభావం కొన్నేండ్లపాటు గుర్తుంచుకోదగినదే. టెస్ట్ ప్లేయర్‌గా ముద్రపడ్డ నాయర్.. 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేయడం విశేషం. తన పునరాగమనాన్ని ఘనంగా చాటిన కరుణ్‌కు క్రికెట్లో ఇది రెండో అవకాశం వంటిదే. 2022లో అతడు అభ్యర్థించినట్టే క్రికెట్ అతడికి మరో చాన్స్ ఇచ్చింది.
టెస్టు క్రికెట్లో అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యే ట్రిపుల్ సెంచరీ కలను ఆడిన మూడో టెస్టులోనే నెరవేర్చుకున్న కరుణ్ నాయర్ జాతీయ జట్టుకు దూరమై ఎనిమిదేండ్లు దాటింది. 2016లో మొహాలీ టెస్టులో అరంగేట్రం చేసిన అతడు.. అదే సిరీస్‌లో భాగంగా చెన్నైలో త్రిశతకం బాదాడు. కానీ ఆరు నెలలు కూడా తిరగకముందే జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు చేసినా రాష్ట్ర స్థాయి జట్టు (కర్నాటక) కూడా పొమ్మనకుండా పొగబెట్టింది. ఐపీఎల్లో (చివరి సారిగా 2022 సీజన్లో 3 మ్యాచ్‌లు ఆడాడు) అయితే అతడి పేరు కూడా చాలా మందికి గుర్తులేదు. 2022లో తన కెరీర్ అగమ్యగోచరంలో పడ్డ సమయంలో కరుణ్ చేసిన ట్వీట్.. క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఈ మూడేండ్లలో అతడి కెరీర్ మరో మలుపు తీసుకుంది. మూడేండ్ల కష్టానికి ఫలితమే ఆదివారం నాటి విధ్వంసం!
జాతీయ జట్టులో చోటు కోల్పోయినా.. రాష్ట్ర జట్టు వదిలేసినా కరుణ్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. తనను ఆదరించిన దేశవాళీనే నమ్ముకున్నాడు. 2023-24 సీజన్ అతడికి ఎంతో ప్రత్యేకం. ఆ సీజన్ రంజీలలో 53.94 సగటుతో ఏకంగా 863 పరుగులు చేసి విదర్భ రంజీ చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. విజయ్ హజారే ట్రోఫీలో అయితే కరుణ్ విధ్వంసం తారాస్థాయికి చేరింది. 8 ఇన్నింగ్స్‌లలో 779 పరుగులతో దుమ్మురేపాడు. ఇందులో ఐదు శతకాలున్నాయి. ముస్తాక్ అలీ ట్రోఫీలో 255 రన్స్‌తో మెరిశాడు. నిలకడగా రాణిస్తున్న కరుణ్‌ను ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తోనే జరుగబోయే టెస్టు సిరీస్‌లో కరుణ్‌ను పక్కనబెట్టలేని పరిస్థితి నెలకొన్నది.