బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై కర్నాటక హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై నియమించిన జ్యుడిషియల్ కమిషన్.. ప్రభుత్వానికి ఇటీవలే నివేదికను సమర్పించింది.
అయితే నివేదికలో అంశాలను బహిర్గత పర్చాలంటూ తాజాగా కర్నాటక హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నివేదికను దాచి ఉంచాల్సిన అవసరం లేదన్న హైకోర్టు ఘటన సంబంధించిన నిజాలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావాలని పేర్కొంది. ఈ ఘటనకు కారణమైన ఆర్సీబీ, కర్నాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ), డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్కు విచారణ నివేదిక పంపించాలని తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది.