వడోదరా: విజయ్ హజారే వన్డే టోర్నీని కర్నాటక రికార్డు స్థాయిలో ఐదోసారి కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో కర్నాటక 36 పరుగుల తేడాతో విదర్భపై అద్భుత విజయం సాధించింది. కర్నాటక నిర్దేశించిన 349 పరుగుల లక్ష్యఛేదనలో విదర్భ 48.2 ఓవర్లలో 312 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్ ధృవ్షోరె(110) హ్యాట్రి క్ సెంచరీతో కదంతొక్కగా, సూపర్‌ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కరణ్నాయర్(27) ఫైనల్లో నిరాశపరిచాడు.
కౌశిక్(3/47), ప్రసిద్ధ్ కృష్ణ(3/84), అభిలాష్(3/58) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన విదర్భ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఆఖర్లో హర్ష్‌దూబే(63) రాణించినా జట్టును గెలిపించలేకపోయాడు. తొలుత స్మరణ్(101) సెంచరీతో కర్నాటక 50 ఓవర్లలో 348/6 స్కోరు చేసింది. క్రిష్ణన్(78), మనోహర్(79) అర్ధసెంచరీలతో కదంతొక్కా రు. స్మరణ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, కరణ్నాయర్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.