T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో ఆదివారం భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ జరుగనుంది. భారీ స్థాయిలో ప్రేక్షకులు తరలిరానున్న ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఐసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్(Nassau County International) స్టేడియం వేదికగా జరిగే ఈ పోరుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. అది కూడా సాక్షాత్తు ఓ అసెంబ్లీ స్పీకర్ మ్యాచ్ నిలిపివేయాలని కోరడం గమనార్హం.
చిరకాల ప్రత్యర్థితో టీమిండియా వరల్డ్ కప్‌లో ఆడడాన్ని కర్నాటక(Karnataka) అసెంబ్లీ స్పీకర్ యూ టీ ఖాదర్(UT Khader) వ్యతిరేకించాడు. పాకిస్థాన్ టీమ్‌తో భారత జట్టు అసలు క్రికెట్టే ఆడొద్దని ఆయన అన్నారు. అంతేకాదు వరల్డ్ కప్‌లో రోహిత్ సేన పాక్‌ను ఓడించడంతో పాటు ట్రోఫీని అందుకోవాలని ఆకాంక్షించాడు.
యూ టీ ఖాదర్
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాక్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ ప్రభావంతో ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయాయి. అంతర్జాతీయ వేదికలపై మాత్రమే ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌లు తలపడుతున్నాయి. నిరుడు ఆసియా కప్(Asia Cup), వన్డే వరల్డ్ కప్(ODI World Cup)లో దాయాదులు ఎదురుపడగా.. టీమిండియా జయభేరి మోగించింది. ఇప్పుడు మరోసారి ఇరుజట్లు ఐసీసీ ట్రోఫీలో అమీతుమీకి సిద్ధమయ్యాయి.