IPL 2026 : ఆర్సీబీ విక్టరీ పరేడ్లో జరిగిన తొక్కిసలాట(Stampede) ఘటనతో చిన్నస్వామి స్టేడియం మ్యాచ్లకు దూరమైంది. పదకొండు మంది మృతికి కారణమైనందున కోర్టు కేసు.. పోలీసులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) ఇవ్వకపోవడంతో.. ఆరు నెలలుగా ఇక్కడ ఒక్క మ్యాచ్ జరగడం లేదు. ఐపీఎల్ మ్యాచ్లను కూడా చిన్నస్వామి నుంచి తరలిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నస్వామి స్టేడియం బెంగళూరుకు గర్వకారణమని చెప్పిన ఆయన.. ఎలాగైనా రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తామని అన్నారు.
ఐపీఎల్లో తొలిసారి విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు.. విజయ యాత్ర జూన్లో పెను విషాదానికి దారి తీసింది. 30 వేల సామర్ధ్యమున్న చిన్నస్వామి స్టేడియానికి 3 లక్షలమంది పోటెత్తారు. అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనేందుకు వచ్చిన అభిమానులను పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనతో చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లకు ఎండ్ కార్డ్ పడింది. జూన్ నుంచి.. మ్యాచ్ల పునరుద్ధరణ కోసం కర్నాటక క్రికెట్ సంఘం చేయని ప్రయత్నమంటూ లేదు. డిసెంబర్16న ఐపీఎల్ వేలం.. ఆ వెంటనే సీజన్ షెడ్యూల్ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో కర్నాటక ఉప-ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Karnataka Deputy CM D.K. Shivakumar stated that Chinnaswamy Stadium will continue to host IPL matches and will see improved measures for managing spectators. 🏟️🏏#IPL2026 #RCB #Sportskeeda pic.twitter.com/dJcyTY9YGs
— Sportskeeda (@Sportskeeda) December 7, 2025
‘భవిష్యత్లో తొక్కిసలాట వంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తపడుతాం. రాబోయే రోజుల్లో కర్నాటక క్రికెట్ స్టేడియం ఆధ్వర్యంలోని చిన్నస్వామిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం. చిన్నస్వామి మన బెంగళూరుకు గర్వకారణం. స్టేడియంలో మ్యాచ్లు ఆడించేటప్పుడు భారీగా అభిమానులను అనుమతించకుండా చర్యలు తీసుకుంటాం. అంతేకాదు చిన్నస్వామికి ప్రత్యామ్నాయంగా ఒక పెద్ద స్టేడియం నిర్మిస్తాం. నిరుడు తొక్కిసలాట తర్వాత నెలకొన్న పరిస్థితులతో ఐపీఎల్ మ్యాచ్లను బెంగళూరు నుంచి తలరిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇప్పటికిప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోరని అనుకుంటున్నా. చిన్నస్వామిలోనే ఐపీఎల్ ఆడిస్తాం. అందుకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం’ అని శివకుమార్ తెలిపారు.
Karnataka Deputy CM D.K. Shivakumar has said that IPL matches will not be moved from Bengaluru’s M. Chinnaswamy Stadium! pic.twitter.com/UG3BDqDlbe
— CRICKETNMORE (@cricketnmore) December 7, 2025
బెంగళూరు నడిబొడ్డున 17 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన చిన్నస్వామి స్టేడియంలో భద్రతా లోపాలు ఉన్నాయని ఏకసభ్య కమిషన్ తీర్పునిచ్చింది. అందుకని పోలీసులు కర్నాటక క్రికెట్ సంఘానికి ఎన్ఓసీ ఇవ్వడం లేదు. దాంతో.. స్వతంత్ర సభ్యుడి నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేలా కర్నాటక ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఒకవేళ.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈసారి కూడా చిన్నస్వామిలో ఐపీఎల్ మ్యాచ్లు జరగడం ఖాయం.