Kapil Dev : స్వదేశంలో జరుగబోయే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో భారత జట్టు ఫేవరెట్ అని మాజీ సారథి కపిల్ దేవ్(Kapil Dev) అన్నాడు. అంతేకాదు ట్రోఫీని నిలబెట్టుకోవడానికి ఆటగాళ్లు ఏం చేయాలి? అనేది కూడా సూచించాడు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని జయిస్తేనే అంచనాలను అందుకుంటారని, అప్పుడే విజేతగా నిలుస్తారని ఈ వరల్డ్ కప్ హీరో తెలిపాడు. ‘భారత జట్టు ట్రోఫీ ఎలా సాధిస్తుందనేది నాకు తెలియదు. ఇంకా వరల్డ్ కప్ జట్టును ప్రకటించలేదు. అయితే.. చాలా ఏళ్లుగా ఎక్కడ ప్రపంచ కప్ జరిగినా టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
జట్టుపై అభిమానుల అంచనాలు ఒత్తిడికి గురి చేస్తాయి. వాటన్నింటినీ జయించిస్తేనే రోహిత్(rohit sharma) సేన టైటిల్ సాధిస్తుంది. ఇదివరకే సొంత గడ్డపై ఒక ట్రోఫీ గెలిచాం. ఈసారి కూడా కప్పు కొడతామనే నమ్మకం నాకుంది. జట్టుకి ఎంపికైన ప్రతి ఒక్కరు ట్రోఫీ లక్ష్యంగా ఆడతారు. ఎందుకంటే..? వరల్డ్ కప్ అనేది నాలుగేళ్లకు ఓసారి వస్తుంది’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
కపిల్ దేవ్, రోహిత్ శర్మ
అంతేకాదు ఈ మధ్య క్రికెటర్లు ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు తరచూ గాయపడడం(Injuries)పై కూడా కపిల్ స్పందించాడు. శరీరంపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలంటే ఫిట్‌గా ఉండడమే పరిష్కారమని అన్నాడు. ‘ఇప్పటితో పోల్చితే మా కాలం వేరు. మేము చాలా తక్కువ క్రికెట్ ఆడాం. కానీ, ఈకాలంలో 10 నెలల పాటు క్రికెట్ ఆడుతున్నారు. ఈ పరిస్థితుల్లో గాయాల బారిన పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకని శరీరంపై దృష్టి పెట్టాలి. అయితే.. ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి తమకు అనువైన విధంగా ఫిటెనెస్ కాపాడుకోవాలి’ అని కపిల్ వెల్లడించాడు.
భారత జట్టు గొప్ప కెప్టెన్లలో కపిల్ దేవ్ ముందు వరుసలో ఉంటాడు. మన జట్టు పేరును విశ్వవ్యాప్తం చేసిన మొదటి సారథి అతనే. కపిల్ టీమిండియాకు తొలి వన్డే వరల్డ్ కప్ అందించాడు. 1983లో లార్డ్స్ మైదానంలో కపిల్ బృందం డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్(west indies)ను ఓడించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.
1983లో వరల్డ్ కప్ ట్రోఫీతో కపిల్ దేవ్
అందుకనే భారత జట్టు గొప్ప విజయాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా 1983 వరల్డ్ విజయం గుర్తుకొస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ మొదలవ్వనుంది. నిరుడు ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఆరంభ పోరులో తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ స్టేడియంలో జరుగునంది.