T20 Worldcup – Kapil Dev | ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలైంది. టీమిండియా ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనున్నది. ఇరుజట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, టోర్నీలో టీమిండియా అవకాశాలపై క్రికెట్ పండితులు, మాజీ ఆటగాళ్లు సైతం అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సైతం జోష్యం చెప్పారు.
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ కెప్టెన్ విలేకరులతో మాట్లాడాడు. అయితే, ఇది వింటే అభిమానులు కొంత నిర్సుత్సాహానికి గురవుతారు. ఇంతకీ మాజీ కెప్టెన్ ఏం చెప్పాడంటే.. టీ20 వరల్డ్ కప్‌లో భారతజట్టు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు కేవలం 30శాతం మాత్రమేనని అభిప్రాయపడ్డారు. టీ20 క్రికెట్లో ఈ రోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టు మరో మ్యాచ్‌లో ఓడిపోవచ్చని చెప్పారు. భారతజట్టు సూపర్-4 చేరగలదా? అన్నదే ప్రధాన సమస్య అని, సెమీఫైనల్‌కు చేరుకోవడంపై ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు.
అప్పుడే భవిష్యత్ గురించి ఏమీ చెప్పలేమని, సెమీ ఫైనల్‌కు వెళ్లేందుకు జట్టకు 30శాతం అవకాశాలున్నాయన్నారు. పెద్ద టోర్నీల్లో జట్టు విజయం ఆల్‌రౌండ్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని చెప్పిన హర్యానా హరికేన్.. ఈ సందర్భంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించారు. హార్దిక్ పునరాగమనంతో కెప్టెన్ రోహిత్ శర్మకు కొంత ఊరట కలిగిందన్నారు. అతని రాకతో రోహిత్‌కు ఆరో బ్యాట్‌మెన్ అందుబాటులోకి వచ్చాడన్నారు. హార్దిక్ గొప్ప బ్యాట్‌మెనే కాకుండా.. మంచి బౌలర్, ఫీల్డర్ అంటూ కపిల్‌దేవ్ ప్రశంసించారు.