Kagiso Rabada : ఐసీసీ (ICC) టెస్టు ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా (South africa) ఫాస్ట్ బౌలర్ కాగిసో రబాడా (Kagiso Rabada) అరుదైన ఘనత సాధించాడు. భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumra) ను దాటేసి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. ICC ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (World Test Championship) లో అద్భుతంగా రాణిస్తున్న రబాడా ఇటీవల బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. దాంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆయనకు అగ్రస్థానం దక్కింది.
29 ఏళ్ల రబాడా బంగ్లాతో జరిగిన రెండు టెస్టుల్లో 9 వికెట్లు తీయడం ద్వారా దక్షిఫ్రికా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్, రవిచంద్రన్ అశ్విన్‌లను దాటేసి టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం హాజిల్‌వుడ్ రెండో స్థానంలో, బుమ్రా మూడో స్థానంలో, అశ్విన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా 2019 తర్వాత రబాడా అగ్రస్థానంలో రావడం ఇదే తొలిసారి.
2018 జనవరిలో తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-10 లోకి వచ్చిన రబాడా ఆ తర్వాత వరుసగా ఏడాదిపాటు టాప్-10 లో కొనసాగుతూ వచ్చాడు. 2019 ఫిబ్రవరిలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ రబాడా అగ్రస్థానంలోకి రావడం ఇదే తొలిసారి. ఇదిలావుంటే పాకిస్థాన్ స్పిన్నర్ నొమాన్ అలీ తొలిసారి టాప్-10 జాబితాలో చోటు సంపాదించాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్లు తీయడం ద్వారా నొమాన్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి టాప్ టెన్‌లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం అతను జాబితాలో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు.