హైదరాబాద్: నగరం మరో ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి సిద్ధమైంది. 13 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగనున్న మహిళల కబడ్డీ ప్రపంచకప్‌నకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. వాస్తవానికి ఈ మెగా ఈవెంట్‌ను జూన్‌లోనే పాట్నా (బీహార్)లో నిర్వహించతలపెట్టినా పలు కారణాల వల్ల అది వాయిదాపడింది. ఇదే విషయమై తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేశ్ మాట్లాడుతూ.. ‘ఈ పోటీ నిర్వహణ రేసు నుంచి బీహార్ తప్పుకున్నాక దానిని తెలంగాణకు తరలించాలని మేము భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్యను కోరాం.
అందుకు వాళ్లు అంగీకరించారు’ అని అన్నారు. ఆగస్టు 3 నుంచి 10 వరకు జరగాల్సి ఉన్న ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొనే అవకాశముంది. 2012లో పాట్నా వేదికగా తొలి మహిళల కబడ్డీ ప్రపంచకప్ జరుగగా మళ్లీ 13 ఏండ్ల తర్వాత ఈ టోర్నీ రెండో ఎడిషన్ జరుగనుండగం గమనార్హం. ఇక హైదరాబాద్ 2005లో ఏషియా కబడ్డీ చాంపియన్‌షిప్‌ను నిర్వహించిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఓ కబడ్డీ ఈవెంట్‌ను నిర్వహించనుండటం ఇదే ప్రథమం.