IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ కోసం స్టార్ ఆటగాళ్లంతా తమ తమ జట్టుతో కలుస్తున్నారు. రాంచీ టెస్టు హీరో ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో కలిశాడు. ఈ సందర్భంగా అతడికి అపూర్వ స్వాగతం లభించింది. కారు దిగి హోటల్లోకి అడుగపెట్టిన జురెల్‌కు అక్కడి సిబ్బంది సైనికుల మాదిరిగా వెల్కమ్ చెప్పారు. రెడ్ కార్పెట్ పరిచిన దారికి రెండు వైపులా వరుసగా నిల్చొని జురెల్‌కు సెల్యూట్ చేశారు. ఊహించని స్వాగతంతో ఈ యంగ్‌స్టర్ ఉబ్బితబ్బిబ్బయ్యాడునకో.
సంతోషంతో పొంగిపోయిన జురెల్ తేరుకొని వాళ్లందరికీ సెల్యూట్ చేసి రూమ్‌కు వెళ్లాడు. ఈ వీడియోను రాజస్థాన్ ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పెట్టింది. దానికి ‘ఈ తరహా స్వాగతానికి నువ్వు అర్హుడివి’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది.
ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
The only way you deserve to be welcomed, @dhruvjurel21 💗🫡 pic.twitter.com/nqDViH8CsV
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2024
జురెల్‌కు ఈ స్థాయిలో వెల్కమ్ లభించడానికి కారణం లేకపోలేదు. ఇంగ్లండ్‌తో రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో అతడు ఒంటరిపోరాటంతో జట్టును ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ(96)తో టీమిండియాను పొటీలో నిలిపిన జురెల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఖతర్నాక్ బ్యాటింగ్ చేశాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి 74 పరుగులు జోడించి భారత జట్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
శుభ్‌మన్ గిల్, జురెల్
దాంతో, 17వ సీజన్లో అతడిపై రాజస్థాన్ భారీ ఆశలే పెట్టుకుంది. నిరుడు డెత్ ఓవర్లలో దంచికొట్టిన ఈ చిచ్చరపిడుగు ఈసారి తన తడాఖా చూపేందుకు సిద్ధంగా ఉన్నాడు. 2024 ఎడిషన్‌లో సంజూ శాంసన్ సేన తొలి పోరులో భాగంగా మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది.