కెరీర్లో భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నారు యువహీరో అక్కినేని అఖిల్. ఈ నేపథ్యంలో కథల ఎంపికలో ఆయన పంథా మార్చారు. మాస్ ఎంటర్టైనర్ ‘లెనిన్’తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తయింది. మే 1న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెడుతూ సోమవారం ‘వారెవా వారెవా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
‘విన్నావా విన్నావా కన్నెపిల్ల ఏమన్నదో విన్నావా..వారెవా వారెవా’ అంటూ చక్కటి రొమాంటిక్ ఫీల్‌తో సాగిందీ పాట. నాయకానాయికలు అఖిల్, భాగ్యశ్రీబోర్సే మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ రచించిన ఈ పాటను శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ ఆలపించారు. తమన్ స్వరకర్త. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో బలమైన సామాజికాంశాలుంటాయని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్ ఎస్, రచన-దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు.