MANU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను చేజిక్కించుకునేందుకు నిరుడు రేవంత్ సర్కార్ చేసిన విఫలయత్నాలు మరువకముందే.. మరో కేంద్ర విశ్వ విద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నుపడింది. తాజాగా మౌలానా ఆజాద్ నేషన్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాలను లాక్కునేందుకు అడుగులు వేస్తున్నది. ఈ మేరకు రెవెన్యూశాఖ నోటీసులు కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను ఇప్పుడు మరో యూనివర్సిటీ భూములపై పడింది. హెచ్‌సీయూ భూములను లాక్కొనేందుకు ప్రయత్నించిన తరహాలోనే తాజాగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)పై కన్నేసింది. వర్సిటీకి కేటాయించిన భూముల్లోని 50 ఎకరాలను వెనక్కి తీసుకొనేందుకు కుట్ర చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాలను చెరబట్టి విలువైన ప్రభుత్వ భూములను కొట్టేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గండిపేట మండలం మణికొండ పరిధిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములను కాజేసేందుకు వ్యూహరచన చేస్తున్నది. డిసెంబర్ 15న ‘మనూ’లో ఖాళీగా ఉన్న 50 ఎకరాలను జప్తు చేసేందుకు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి నోటీస్ సైతం పంపారు. వర్సిటీకి చెందిన 200 ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను వెనక్కి తీసుకొంటామని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు.
1998లోనే కేటాయింపు
మణికొండ గ్రామంలోని సర్వేనంబర్ 211, 212లోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పటి కలెక్టర్ హెచ్ఎండీఏకు కేటాయించారు. వాటిని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు అప్పగిస్తున్నట్టు 1998 జులై 23న హెచ్ఎండీఏ పంచనామా చేసింది. ఆ భూమి మొత్తాన్ని వర్సిటీ భవనాలతోపాటు పలు రకాలుగా వినియోగిస్తున్నది. 2024 ఆగస్టు 27న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మైనారిటీ, ఆడిట్ కమిటీ సమావేశమై ‘మనూ’లో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను జప్తు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 50 ఎకరాలను తిరిగి తీసుకొనేందుకు రిజిస్ట్రార్‌కు నిరుడు డిసెంబర్ 15న నోటీస్ జారీచేశారు.
భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు
50 ఎకరాల ఖాళీస్థలంలో వివిధ విభాగాల భవనాలు నిర్మిస్తామని ఈ నెల 1న కలెక్టర్‌కు యూనివర్సిటీ రిజిస్ట్రార్ లేఖ రాశారు. వివిధ రకాల భవనాలు, వసతి గృహాలు, అకాడమిక్ అవసరాల వంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదించినట్టు పేర్కొన్నారు. ఆయా భవనాల నిర్మాణానికి సంబంధించిన నిధులను ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖకు కూడా నివేదించామని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాగానే నిర్మాణాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలు తెలిపేందుకు 2 నెలల సమయం కావాలని కలెక్టర్‌ను కోరారు.
భూములను కాజేస్తే ఉద్యమమే..
‘మనూ’ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కాజేయాలని చూస్తే ఉద్యమిస్తామని విద్యార్థు లు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టేందుకు ప్రయత్నించి వి ఫలమైన రేవంత్ సర్కార్.. ఇప్పుడు మనూ భూములపై కన్నేసిందని ఆరోపిస్తున్నారు. అన్యాక్రాంతం చేయాలని చూస్తే హెచ్‌సీయూ తరహాలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చి చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. విద్యాభివృద్ధిని పక్కనపెట్టి హైదరాబాద్‌ను కాంక్రీట్ జంగల్‌గా మార్చేందుకు కు ట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘నిరుపయోగం’ పేరిట విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని విద్యావేత్త లు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.