IND A vs ENG Lions : ఇంగ్లండ్ గడ్డపై భారత కుర్రాళ్లు తమ తడాఖా చూపించారు. బౌలింగ్ దళం విఫలమైనా బ్యాటింగ్‌లో తమకు తిరుగులేదని చాటారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ లయన్స్(England Lions) బౌలర్లను ఉతికారేస్తూ అర్ధ శతకాలతో కదం తొక్కారు. ఏకంగా టాపార్డర్‌లోని నలుగురు హాఫ్ సెంచరీలతో రెచ్చిపోవడంతో ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది. 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(64), అభిమన్యు ఈశ్వరన్(68)లు శుభారంభం ఇచ్చారు. ఈ ఇద్దరు త్వరగానే ఔటైనా.. నాలుగో రోజు ధ్రువ్ జురెల్(53 నాటౌట్), నితీశ్ రెడ్డి (52 నాటౌట్)లు అజేయంగా నిలవడంతో మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రా అయింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన భారత్.. అనంతరం ఇంగ్లండ్ లయన్స్‌ను కట్టడి చేయడంలో విఫలమైంది. బౌలర్లు తేలిపోవడంతో లయన్స్ 587 పరుగులకు ఆలౌట్ అయింది. 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ నాలుగో రోజు 2 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఓపెనింగ్ జోడీ తొలి వికెట్‌కు 123 పరుగులతో గట్టి పునాది వేయగా.. కుర్రాళ్లు ధ్రువ్ జురెల్(53 నాటౌట్), నితీశ్ రెడ్డి (52 నాటౌట్)లు ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. మూడో వికెట్‌కు వీళ్లిద్దరూ 81 రన్స్ జోడించి ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లను విసిగించారు. దాంతో, మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరుజట్ల మధ్య జూన్ 6న రెండో టెస్టు మొదలు కానుంది.
Four India A batters scored half-centuries in the second dig after Lions took a 30-run first-innings lead https://t.co/vmHIKYHFbJ
— ESPNcricinfo (@ESPNcricinfo) June 3, 2025
ఐదు టెస్టుల సిరీస్ సన్నద్ధతలో ఉన్న భారత క్రికెటర్లు మొదటి అనధికార టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగి ఆడారు. కరుణ్ నాయర్ (204) ద్విశతకంతో కదంతొక్కగా.. సర్ఫరాజ్ ఖాన్(92), ధ్రువ్ జురెల్(94)లు వీరకొట్టుడు కొట్టారు. టెయిలెండర్స్ సైతం బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా 557 పరుగులు చేసింది.
కరుణ్ నాయర్ (204)
అయితే.. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ టామ్ హైన్స్(171) సూపర్ సెంచరీతో గట్టి పునాది వేశాడు. మిడిలార్డర్ బ్యాటర్లు మాక్స్ హోల్డెన్(101)తో పాటు మౌస్లే(113)లు శతకాలు బాదగా 587 రన్స్ చేసింది. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు, శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టారు.