England One Day Record | ఇంగ్లండ్ బ్యాట్స్మన్లు చెలరేగిపోయారు. తమ సొంత రికార్డునే తిరగరాశారు. సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశారు. ఇంటర్నేషనల్ వన్డేల్లో ఇప్పటికే 481 పరుగులతో ఉన్న పాత రికార్డును అధిగమించి 498 పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌తో ఆమ్స్టెల్వీన్లో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ ఈ మైలురాయి నమోదు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్‌లో మొత్తం 26 సిక్సర్లు, 34 ఫోర్లు రికార్డయ్యాయి. దీన్ని బట్టి ఇంగ్లండ్ బ్యాట్స్మన్లు ఎంత విధ్వంసకర ఆట ఆడారో అర్థమవుతుంది.
మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే టాస్ గెలుచుకున్న నెదర్లాండ్స్ సారధి పీటర్ సీలార్.. ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ప్రారంభంలో ఓపెనర్ రాయ్ కేవలం ఒక్క పరుగుతోనే క్రీజ్‌ను వదిలేసినా.. తర్వాత వచ్చిన బ్యాట్స్మన్లంతా విధ్వంసం సృష్టించారు. రెండో ఓపెనర్ ఫిలిప్ స్టాల్ 93 బంతుల్లో 123 పరుగులతో తన కెరీర్లోనే తొలి సెంచరీ నమోదు చేశాడు.
109 బంతుల్లో 125 పరుగులు చేసిన డేవిడ్ మలన్‌తో కలిసి జట్టు స్కోర్‌ను పరుగులు తీయించాడు ఫిలిప్ స్టాల్. అటుపై బ్యాటింగ్‌కు వచ్చిన జాస్ బట్లర్.. ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగిపోయాడు. సిక్సర్లతో నెదర్లాండ్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం 70 బంతుల్లో 162 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ దశలో మోర్గాన్ డకౌట్ అయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన లియామ్ లివింగ్ స్టోన్ కూడా చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లో 66 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడంటే ఎంత దూకుడుగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక దశలో జట్టు స్కోర్ 500 దాటుతుందని అనిపించినా చివరకు 498 పరుగుల వద్ద నిలిచిపోయింది.
గమ్మత్తేమిటంటే నెదర్లాండ్స్‌పై వన్డేలో అత్యధికంగా 498 పరుగులతో కొత్త రికార్డు నెలకొల్పిన ఇంగ్లండ్.. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై 481 పరుగులు, పాకిస్థాన్‌పై 444 పరుగులు చేసిన రికార్డులు సాధించింది. ఇంగ్లండ్ తర్వాత వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 439 పరుగులు, ఆస్ట్రేలియాపై 438 పరుగులతో, భారత్‌పై వెస్టిండీస్ 438, జింబాబ్వేపై 418 పరుగుల రికార్డు నమోదు చేసింది. నెదర్లాండ్స్‌పై శ్రీలంక 443, దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 434, వెస్టిండీస్‌పై భారత్ 418 పరుగులతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.