HCA | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఏ డివిజన్ టీ20 లీగ్ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జింఖానా మైదానం వేదికగా మారేడ్‌పల్లి కోల్ట్స్‌తో జరిగిన ఫైనల్లో ఉమ్మడి జిల్లా టీమ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మారేడ్‌పల్లి కోల్ట్స్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యఛేదనలో జిల్లా జట్టు 19.2 ఓవర్లలో 209/7 పరుగులు చేసింది. అర్ఫాజ్(52 నాటౌట్), హర్షవర్ధన్‌సింగ్(49) రాణించారు.
తొలుత మారేడ్‌పల్లి కోల్ట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 204/4 స్కోరు చేసింది. మికిల్ జైస్వాల్(64 బంతుల్లో 107, 8ఫోర్లు, 8సిక్స్‌లు) సెంచరీతో విజృంభించాడు. విజేతగా నిలిచిన ఉమ్మడి జిల్లా జట్టును హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు, కార్యవర్గ సభ్యులు ఆగంరావు, శ్రీనివాస్, రాజశేఖర్, రవికుమార్ అభినందించారు. మున్ముందు జరుగబోయే టోర్నీల్లో జిల్లా ప్లేయర్లు ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని ఆశిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు.