Joe Root : డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్(England) జట్టులో పండుగ వాతావరణం నెలకొంది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(Ben Stokes) వన్డే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడమే అందుకు కారణం. అతడి రాకతో ఆ టీమ్ మరితం బలంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు స్టోక్స్ యూ టర్న్ తీసుకోవడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అతడి స్నేహితుడు అయిన మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) స్టోక్స్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. ఇంగ్లండ్ జట్టు అందించిన గొప్ప క్రికెటర్లలో స్టోక్స్ ఒకడని అన్నాడు. అంతేకాదు ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను చూసి మిగతా జట్లలో కలవరం మొదలైందని రూట్ చెప్పాడు.
‘వన్డేల్లో స్టోక్స్ ప్రస్థానం ముగిసిందని ప్రపంచంలోని ప్రతి జట్టు అనుకొని ఉంటుంది. కానీ, అతడి రాకతో మా జట్టులోని ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. మ్యాచ్ విన్నర్(Match Winner)గా స్టోక్స్ ఇప్పటకే నిరూపించుకున్నాడు. కష్ట సమయంలో అద్భుతంగా ఆడడంలో అతడు దిట్ట’ అని రూట్ వెల్లడించాడు. అంతేకాదు 2019 వన్డే వరల్డ్ కప్, నిరుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో స్టోక్స్ పాత్రపై కూడా రూట్ స్పందించాడు. మేము ఈమధ్య రెండు ఐసీసీ ఫైనల్స్‌లో గెలిచాం. అందుకు కారణం అతడే. అయితే.. 2016లో విండీస్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయాం. కానీ, ఇప్పటికీ స్టోక్స్ ఫైనల్ ఓవర్లో ఆడేందుకు ఎంతో ఇష్టపడతాడు’ అని రూట్ చెప్పుకొచ్చాడు.
బెన్ స్టోక్స్
ఇప్పటివరకూ స్టోక్స్ మూడు వరల్డ్ కప్‌లు ఆడాడు. 2019 ఫైనల్లో ఈ విధ్వంసక ఆల్‌రౌండర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు. ఆ ఓవర్లో జోఫ్రా ఆర్చర్(Jofra Archer) సంచలన బౌలింగ్‌తో న్యూజిలాండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. దాంతో, ఇంగ్లండ్ మొదటిసారి వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది.
అలానే నిరుడు పొట్టి ప్రపంచ కప్(T20 World Cup) ట్రోఫీ గెలవడంలోనూ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. ఈమధ్యే అతడి సారథ్యంలోని ఇంగ్లండ్ సొంత గడ్డపై యాషెస్ సిరీస్(Ashesh Series) డ్రా చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిన ఆ జట్టు అనూహ్యంగా పుంజుకొని సిరీస్‌లో నిలిచింది. అదంతా స్టోక్స్ కెప్టెన్సీ మహిమ అని మాజీలు అతడిని కొనియాడారు.