Asia Cup 2023 : ఆసియా కప్ పోటీలకు మరో వారం రోజులే ఉంది. ఈ సమయంలో బంగ్లాదేశ్(Bangladesh)కు గట్టి షాక్ తగిలింది. సీనియర్ పేసర్ ఎబాదత్ హొస్సేన్(Ebadot Hossain) టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కుడి చేతికి గాయం కారణంగా అతను ఆసియా కప్‌లో ఆడడం లేదని బంగ్లా క్రికెట్ బోర్డు(BCB) వెల్లడించింది. అతడి స్థానంలో యువ పేసర్ తంజిమ్ హసన్ షకిబ్(Tanzim Hasan Sakib)కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల తంజిమ్ రెండేళ్ల క్రితం అండర్ -19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. అంతేకాదు ఈమధ్యే ముగిసిన ఏసీసీ ఎమర్జింగ్ పురుషుల ఆసియా కప్(ACC Emerging Assia Cup)లోనూ ఈ యంగ్‌స్టర్ సత్తా చాటాడు. కేవలం మూడు మ్యాచుల్లోనే 9 వికెట్లు పడగొట్టాడు.
‘ఎబాదత్ ఆరు వారాల పాటు రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ సమయంలో మేము చాలా ఎంఆర్ఐ స్కానింగ్‌లు తీశాం. దాంట్లో అతడి గాయం పూర్తిగా తగ్గలేదని తెలిసింది. అందుకని ఎబడాట్ ఆసియా కప్ నుంచి వైదొలిగాడు. అయితే.. వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లోపు ఎబాదత్ ఫిట్నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నాం’ అని బీసీబీ చీఫ్ ఫిజీషియన్ దెబాషిస్ చౌదురీ(Debashis Chowdhury) వెల్లడించాడు.
తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) వన్డే కెప్టెన్‌గా తప్పుకోవడంతో తర్వాతి సారథి ఎవరు? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. అనుభవజ్ఞుడైన మాజీ సారథి షకిబుల్ హసన్(Shakib Al Hasan)కు సెలెక్టర్లు పగ్గాలు అప్పగించారు. ఆ వెంటనే అంటే.. 10 రోజుల క్రితమే 17మంది స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆగస్టు 30న ఆసియా కప్ మొదల్వనుంది. హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఈ టోర్నీకి శ్రీలంక, పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ స్క్వాడ్ : షకిబుల్ హసన్(కెప్టెన్), లిట్టన్ దాస్, నజ్ముల్ హుసేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీం, అఫిఫ్ హొసేన్ ద్రుబో, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్ముద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, నసుం అహ్మద్, షేక్ మెహిదీ హసన్, నయీం షేక్, షమీమ్ హొసేన్, తాంజిద్ హసన్ తమీమ్, తంజిమ్ హసన్ షకిబ్.