BCCI | తెలంగాణ యువ కెరటం తిలక్ వర్మ తొలిసారి భారత వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. టీ20ల్లో వెస్టిండీస్‌ను రఫ్ఫాడించిన తిలక్ ఆసియాకప్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు జరగనున్న ఆసియాకప్ కోసం భారత సెలెక్షన్ కమిటీ సోమవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ సారథ్యంలోని ఈ జట్టులో గాయాల నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సంజూ శాంసన్ బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.
న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్లో దంచి కొడుతున్న తెలంగాణ కుర్రాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మకు.. భారత వన్డే జట్టులో చోటు దక్కింది. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆడిన ఐదు టీ20 మ్యాచ్‌ల్లోనూ దుమ్మురేపిన తిలక్ ప్రతిష్ఠాత్మక ఆసియాకప్‌నకు ఎంపికయ్యాడు. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్ కోసం భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ సోమవారం జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన ఈ టీమ్‌లో తిలక్‌కు తొలిసారి అవకాశం దక్కగా.. గాయాల నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా ఎంపికయ్యారు. శ్రేయస్ పూర్తి ఫిట్నెస్ సాధించగా.. రాహుల్ ఇంకా కోలుకోకపోయినా టోర్నీ సమయానికి సిద్ధంగా ఉంటాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రాహుల్‌కు బ్యాకప్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినట్లు అగార్కర్ పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో జరుగనున్న ఈ టోర్నీలో భారత్ ఆరు మ్యాచ్‌లు (ఫైనల్‌కు చేరితే) ఆడనుంది. అక్టోబర్ 5 నుంచి సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. మెగాటోర్నీకి ఆసియాకప్‌ను రిహార్సల్‌గా భావిస్తున్నారు. జట్టు ప్రకటన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు అంశాలపై వీరిద్దరూ మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా సిద్ధంగానే ఉన్నా.. కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఆసియాకప్ ప్రారంభం వరకు అతడు కూడా అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతోనే రాహుల్‌కు బ్యాకప్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేశాం.
భారత జట్టుకు శిఖర్ ధవన్ ఎంతో చేశాడు. అయితే ప్రస్తుతం రోహిత్, శుభ్‌మన్ గిల్లను ఓపెనర్లుగా చూస్తున్నాం. ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేశాం. కాంబినేషన్ సమస్య వల్లే చాహల్‌ను తీసుకోలేకపోయాం. ఎనిమిదో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగల వాళ్ల కోసం చూస్తున్నాం. దీని వల్లే అక్షర్ ఎంపిక సులువైంది. అతడితో పాటు కుల్దీప్ స్పిన్ బాధ్యతలు చూసుకుంటారు.
ఆసియాకప్ కోసం భారీ జట్టును ప్రకటించే వీలు ఉండటంతోనే.. కోచ్, కెప్టెన్‌కు అదనపు వెసులుబాట్లు కల్పించాలనే ఉద్దేశంతో 17 మందిని ఎంపిక చేశాం. వన్డే ప్రపంచకప్ విషయానికి వస్తే 15 మందినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు.
తుది జట్టు కూర్పును దృష్టిలో పెట్టుకునే ఆటగాళ్ల ఎంపిక సాగుతుంది. రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు యుజ్వేంద్ర చాహల్ గురించి సుదీర్ఘంగా చర్చించాం. 17 మందినే ఎంపిక చేసే చాన్స్ ఉండటంతో వారికి టీమ్‌లో అవకాశం దక్కలేదు. ఇంతటితో వన్డే వరల్డ్‌కప్‌నకు వారికి తలుపులు మూసుకున్నట్లు కాదు.
జట్టులోని ప్లేయర్లంతా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉండాలి. అప్పుడే పరిస్థితులకు తగ్గట్లు లైనప్ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే పాండ్యాతో ఓపెనింగ్ చేయించాలి.. గిల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాలని నా ఉద్దేశం కాదు.
నాలుగో స్థానంలో ఆడేందుకు చాలా మంది అందుబాటులో ఉన్నారు. అది పెద్ద సమస్య కాదు. బ్యాటింగ్ ప్లేస్ అంత ముఖ్యం కాదు. జట్టును గెలిపించే ఆటగాళ్లు కావాలి అంతే.
భారత జట్టు: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, ఇషాన్, సూర్య, తిలక్ వర్మ, రాహుల్, పాండ్యా, బుమ్రా, జడేజా, శార్దూల్, అక్షర్, కుల్దీప్, షమీ, సిరాజ్, ప్రసిద్ధ్.. శాంసన్*.
నెల రోజుల క్రితం వరకు కనీసం చర్చల్లో కూడా లేని ఓ యువ ఆటగాడు.. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌నకు ముందు జరుగనున్న ఆసియాకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. వయసుకు మించిన పరిణతి చూపిస్తూ.. విమర్శకులతో ప్రశంసలు అందుకున్న ఆ యంగ్‌గన్ మరెవరో కాదు.. మన హైదరాబాదీ ఠాకూర్ తిలక్ వర్మనే! దేశవాళీలతో పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున నిలకడైన ప్రదర్శన చేసి జాతీయ జట్టు తలుపు తట్టిన తిలక్.. వెస్టిండీస్ టూర్లో స్టార్లంతా విఫలమైన చోట తన విలువ చాటుకున్నాడు. తొలి బంతి నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడే తెగువతో పాటు..
అవసరమైతే ఇన్నింగ్స్‌ను నడిపించగల సామర్థ్యం తనలో ఉందని నిరూపించుకున్న తిలక్.. ఆసియాకప్‌కు ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాడు. టీమ్ఇండియా మిడిలార్డర్లో నాణ్యమైన లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ లేకపోవడం కూడా తిలక్‌కు కలిసొచ్చింది. 17 మందితో కూడిన జట్టులో చోటు దక్కించుకున్న తిలక్‌కు ప్లెయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం అంత సులువైన విషయం కాదు. కానీ, అవకాశం వస్తే మాత్రం నిరూపించుకునేందుకు తిలక్ సిద్ధంగా ఉన్నాడు. ఆసియాకప్‌లో ప్రదర్శన ఆధారంగానే వన్డే ప్రపంచకప్ కోసం జట్టు ఎంపిక ఉంటుందనే సూచనల నేపథ్యంలో ఈ టోర్నీ తిలక్‌కు ఎంతో కీలకం కానుంది. మరి మన హైదరాబాదీ ఈ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాలని ఆశిద్దాం!