Joe Root : ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అనే సామెత చాలాసార్లు వినే ఉంటాం. అదే క్రికెట్లో మాత్రం ఇకపై ఈ సామెతను కొత్తగా చెప్పాల్సి ఉంటుందేమో. ఒకే ఇన్నింగ్స్‌తో మూడు రికార్డులు అనే సామెతకు రూపమిచ్చాడు ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ (Joe Root). మాంచెస్టర్ టెస్టులో సూపర్ సెంచరీతో విరుచుకుపడిన అతడు ఏకంగా ముగ్గురు దిగ్గజాలను దాటేశాడు. మూడో రోజు కళాత్మక బ్యాటింగ్‌తో అలరించిన రూట్.. టెస్టుల్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు.
తొలి సెషన్లోనే 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేసిన ఈ రన్ మెషిన్. మరో రెండు రన్స్ కొట్టి జాక్వెస్ కలిస్‌ను మూడో స్థానానికి నెట్టేశాడు. లంచ్ తర్వాత అన్షుల్ కంబోజ్ ఓవర్లో బౌండరీతో శతకం సాధించిన రూట్.. అదే జోరు చూపించి రికీ పాంటింగ్ రికార్డు బ్రేక్ చేశాడు. దాంతో, టెస్టుల్లో సచిన్ తర్వాత ఎక్కువ రన్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడీ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.
Just one more step to climb 📈 pic.twitter.com/508oMr6oyS
— ESPNcricinfo (@ESPNcricinfo) July 25, 2025
పాంటింగ్ 168 మ్యాచుల్లో 41 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో 13,378 రన్స్ సాధించగా.. రూట్ కేవలం 157వ మ్యాచ్‌లోనే ఈ మైలురాయికి చేరువయ్యాడు. ప్రస్తుతం ఈ వరల్డ్ క్లాస్ బ్యాటర్ ఖాతాలో 38 శతకాలు, 66 అర్ధ శతకాలు ఉన్నాయి. టాప్‌లో కొనసాగుతున్ను సచిన్ 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలతో 15,921 రన్స్ కొట్టాడు.