పదో తరగతి వార్షిక పరీక్షలు రాసేందుకు ఈ ఏడాది కూడా విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఒకటికాదు.. రెండుకాదు ఏకంగా పదిహేను కిలోమీటర్ల వరకు బస్సులు, ఆటోల్లో ప్రయాణించి పరీక్షలకు హాజరుకావడం అంటే వారి సహనానికి ‘పరీక్ష’ పెట్టినట్లే. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మారుమూల ప్రాంతాల విద్యార్థుల కోసం సైతం ఎలాంటి రవాణా సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 12,282 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 11 (నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మంజిల్లా మాజీ అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ దంపతులు బుధవారం తమ పెళ్లిరోజు సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు అందుకున్నారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ఎర్రవెల్లిలోని నివాసంలో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవడంతో శాలువా కప్పి సన్మానించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనపై ఇంతగా అభిమానాన్ని చూపిన కేసీఆర్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని రాజేందర్ పేర్కొన్నారు.
– ఇల్లెందు, మార్చి 11
జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు దూరాభారం కావడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఏటా అధికారులు కుస్తీ పడుతున్నా ఆచరణలో మాత్రం విఫలమవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ముందుగానే ఆటోలను మాట్లాడుకొని సిద్ధమవుతున్నారు. సర్కారు నుంచి మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం గమనార్హం.
విద్యార్థులకు తప్పని తిప్పలు..
జిల్లావ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులు పది పరీక్షలు రాయాలంటే వ్యయప్రయాసలతో కూడిన పనే. ఇలాంటి గ్రామాలపై సైతం అధికారులు దృష్టిపెట్టకపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పేట్లు లేవు. పేరుకే ఆర్టీసీ ఉన్నా అవి కొన్ని గ్రామాలకు రూట్లు లేవనే చెప్పాలి. టేకులపల్లి మండలం బోడు పరీక్ష కేంద్రానికి పిల్లలు వెళ్లాలంటే గంగారం నుంచి ఆటోల మీద వెళ్లాలి. దాదాపు 10 కిలోమీటర్ల దూరం. దుమ్ముగూడెం మండలం నర్సాపురం పరీక్ష కేంద్రానికి పర్ణశాల 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సమయానికి బస్సు రాకపోతే ఆటో మీద వెళ్లాల్సిందే. కొత్తపల్లి గ్రామంలో కూడా కొన్ని గ్రామాలకు విద్యార్థులు దూరంగానే ఉన్నారు. ఆళ్లపల్లి మండల కేంద్రంలో పరీక్ష కేంద్రం ఉంది. కానీ, మర్కోడు నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్లాలి.
బస్సు రూటు లేదు. ఆటోలే దిక్కు. అశ్వారావుపేట మండలం సున్నంబట్టి వరకు నారాయణపురం నుంచి రావాల్సిందే. లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లలో పరీక్ష కేంద్రం ఉంది. మైలారం నుంచి రేగళ్ల రావాలంటే 15 కిలోమీటర్ల దూరం రావాల్సిందే. గిరిజన గ్రామాల్లో సమయానికి కొన్ని సర్వీసులు నడుపుతున్నారు.. కానీ, పది దాటితే కష్టమే. పాల్వంచ మండలం ఉల్వనూరు విద్యార్థులు కిన్నెరసాని వచ్చి పరీక్ష రాయాలి. దాదాపు 10 కిలోమీటర్లపైనే దూరం ఉంటుంది. ఇల్లెందు మండలం కొమరారం విద్యార్థులు రొంపేడు స్కూల్‌కు వెళ్లి పరీక్ష రాయాలి. 15 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో ఏటా విద్యార్థులను వేధిస్తున్న ప్రధాన సమస్య అయినప్పటికీ అధికారులు దృష్టి సారించకపోవడం బాధాకరం.
మాకు బస్సు సౌకర్యం లేదు..
మా ఊరు నుంచి అందరం ఆటో మీద వెళ్లాల్సిందే. ఉదయం ఆరుగంటలకే బస్సు ఉంది.. తర్వాత బస్సులు లేవు. సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే ఆటోలను ఆశ్రయించాల్సిందే. 12 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రం ఉన్నా ఉదయాన్నే లేచివెళ్లాలి. ప్రత్యేక బస్సు సర్వీసు వేస్తే మాకు ఇబ్బంది ఉండదు.
– దల్లి అప్పారావురెడ్డి, దుమ్ముగూడెం
పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం..
మారుమూల, దూర ప్రాంతాల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని రవాణా అధికారులతో మాట్లాడినం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షల నిర్వహణను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తారు. అన్ని కేంద్రాల వద్ద తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను అందుబాటులో ఉంచాం.
– నాగలక్ష్మి, డీఈవో, భద్రాద్రి కొత్తగూడెం