Jio Hotstar | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. పాకిస్తాన్, దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఐసీసీ ఈవెంట్‌ను క్రికెట్ ప్రియులు ఎంజాయ్ చేశారు. దాంతో జియో హాట్‌స్టార్ 540కోట్లకుపైగా వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. జియో హాట్‌స్టార్ వ్యూయర్స్ చాంపియన్స్ ట్రోఫీని దాదాపుగా 11వేలకోట్ల నిమిషాల పాటు వీక్షించారు. ఈ సందర్భంగా జియో హాట్‌స్టార్ డిజిటల్ సీఈవో కిరణ్ మణి సోషల్ మీడియా పోస్ట్‌లో వివరాలు వెల్లడించారు. 2025 ఐసీసీ మెన్స్ చాంపియన్స్ ట్రోఫీ ఎంత గొప్ప ప్రయాణం! 540కోట్లకుపైగా వ్యూస్.. 11వేలకోట్ల నిమిషాల వాచ్‌టైమ్ నమోదైందని.. ఒకేసారి గరిష్ఠంగా 6.12కోట్ల మంది’ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంలో మ్యాచ్‌లను వీక్షించారని పేర్కొన్నారు. ఈ వ్యూస్ భారత్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ స్థాయి, అభిరుచి, పెరుగుదలను చెబుతున్నాయని.. చాంపియన్స్ ట్రోఫీ చివరి మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో 124.2కోట్ల వ్యూస్ వచ్చాయన్నారు.
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్-భారత్ తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టును టీమిండియా ఓడించి.. మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలిచింది. ఈ మ్యాచ్ 6.12 కోట్ల వ్యూస్‌తో కొత్త రికార్డు సృష్టించిందని.. ఇది లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్‌లో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఆధిపత్యాన్ని చూపుతుందని కిరణ్ తెలిపారు. ఇంతకు ముందు 2023 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా డిస్నీ హాట్‌స్టార్ 5.9 కోట్ల మంది వ్యూయర్స్‌తో రికార్డును నెలకొల్పింది. అయితే, హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచి 38శాతం లైవ్ స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయని మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి భారీగా వ్యూస్ వచ్చాయి. తొలిసారి ఐసీసీ ఈవెంట్‌ను బ్రాడ్‌కాస్టింగ్ చేసిన జియో హాట్‌స్టార్ తొమ్మిది ప్రాంతీయ భాషల్లో కామెంటేటరీని సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది.