నిన్నటికి నిన్న.. ఉమెన్ ఇన్ బ్లూ సంచలనం నమోదు చేసింది. క్రికెట్ గ్రౌండ్లో అతివలు పూరించిన శంఖారావం మిగతా క్రీడల్లోనూ మగువలకు స్ఫూర్తినిస్తున్నది. క్రికెట్లో టీమ్ ఇండియా విజయాని కన్నా ముందే.. ఫుట్‌బాల్‌లో గెలుపు గోల్ కొట్టేందుకు సిద్ధమవుతున్నది ఝార్ఖండ్ డైనమేట్ అనుష్కా కుమారి. వరుసగా రెండు చాంపియన్‌షిప్స్‌లో టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచింది. ఇటీవల భూటాన్‌లో జరిగిన సౌత్ ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ చాంపియన్‌షిప్ అండర్-17లోనూ జట్టు తరఫున అత్యధిక గోల్స్ సాధించిన అనుష్కా కుమారి ప్రస్థానమిది..
గోల్స్‌లో శ్రీమంతురాలు అనిపించుకున్న అనుష్కా కుమారి అసలు చిరునామా పేదరికం. ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో ఓ పల్లెటూర్లో ఉండేది ఆమె కుటుంబం. అనారోగ్యంతో బాధపడే తండ్రి, కుటుంబ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న తల్లి.. ఇదీ ఆమె నేపథ్యం. ఒక అన్న, ఇద్దరు అక్కలు, తను.. ఇదీ కుటుంబం! కూలి పని చేస్తూ… అందర్నీ పోషించేది తల్లి. ఎన్ని కష్టాలు ఉన్నా.. పిల్లల ఆసక్తులను గమనిస్తూ, ప్రోత్సహించేది.

అనుష్క ఇద్దరక్కలూ బడిలో ఫుట్‌బాల్ ఆడుతుండేవారు. వారిని చూసి ఆరేండ్ల వయసు నుంచే అనుష్క కాలిబంతితో దోస్తీ చేసింది. సరదాగా ఆడటం కాకుండా… ఆటపై మక్కువ కనబరచేది. మెరుపు వేగంతో బంతితో పరుగులు తీసేది. ఆ ఇష్టమే తక్కువ కాలంలోనే బంతిపై పూర్తి నియంత్రణ సాధించేలా చేయగలిగింది. కూతురు ప్రతిభను గమనించిన తల్లి.. మరింత ప్రోత్సహించింది. పదకొండేండ్ల వయసులో తమ గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాలలో చేరింది అనుష్క. అక్కడ ఫుట్‌బాల్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేవాళ్లు. రెండేండ్లలో ఆటలో మరింత రాటుదేలింది. ఆ శిక్షణే తనను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని చెబుతుంది అనుష్క.
కుటుంబమే తనకు అండాదండా అని చెబుతుంది అనుష్క. ‘మా ఇంట్లోవాళ్లు ఎంతగానో ప్రేమించేవాళ్లు. ఆటలో నాకున్న ఆసక్తిని గమనించి.. వారి ఇష్టాలను వదులుకొని మరీ నాకు దన్నుగా నిలిచేవారు. ఈ ఆటపై ఆసక్తి కలగడానికి ప్రేరణే మా అక్కలు. వాళ్లు అందించిన స్ఫూర్తితో ఒక్కోమెట్టూ ఎక్కుతూ వచ్చాను’ అంటుంది అనుష్క. గురుకుల పాఠశాలలో శిక్షణ తన ఆటతీరును మరింత మెరుగుపరిచింది. కొంతకాలానికి ఝార్ఖండ్‌లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం అనుష్కకు దక్కింది. అదే తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అంటుందామె. అక్కడికి వచ్చిన పెద్దలు.. తన ఆటతీరుకు ముచ్చటపడ్డారు. నేషనల్ క్యాంప్‌నకు ఎంపిక చేశారు.
నేషనల్ క్యాంప్ శిక్షణలో మరిన్ని పట్లు సాధించింది. అండర్ 16 జట్టుకు ఎంపికైంది. అలా 2024లో నేపాల్‌లో జరిగిన సౌత్ ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ చాంపియన్‌షిప్ అండర్-16లో పాల్గొంది. అప్పటికి అనుష్క వయసు పదమూడేండ్లే! ఆ టోర్నీలో ప్రతి మ్యాచ్‌లోనూ గోల్ సాధించి అబ్బురపరిచింది. టోర్నమెంట్లో జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసి ఔరా అనిపించుకుంది. ఆ తర్వాత మన దేశంలో జరిగిన పలు టోర్నీల్లోనూ సత్తా చాటింది అనుష్క. ఈ ఏడాది ఆగస్టులో భూటాన్ వేదికగా జరిగిన సౌత్ ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఉమెన్స్ చాంపియన్‌షిప్ అండర్-17లో భారత్ విజయం సాధించింది. ఈ టోర్నీలోనూ అనుష్క టాప్ స్కోరర్‌గా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును అందుకుంది.
‘నేను ఫుట్‌బాల్‌ను ఎంతో ప్రేమించాను. అమ్మానాన్న, అన్నయ్య, అక్కలు నా వెన్నంటే ఉన్నారు. నా ఆటను చూసి వాళ్లు గర్వపడుతుంటారు. వారి సంతోషమే నాకు బలం. అలాగే కోచ్‌లు, తోటి ఆటగాళ్లు నన్ను ప్రత్యేకంగా చూస్తారు. అండర్ 20లో ఆడాలన్నది నా మొదటి కల. తర్వాత దేశానికి ప్రాతినిధ్యం వహించి, మెగా టోర్నీలో గెలవాలన్నదే నా లక్ష్యం’ అని చెబుతున్న అనుష్కకు మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం.
మొదట్లో నేను మిడ్ ఫీల్డర్‌గా ఉండేదాన్ని. తర్వాత స్ట్రైకర్‌గా మారాను. ఇండియన్ ఉమెన్స్ లీగ్ (ఐడబ్ల్యూఎల్ 2) ఫుట్‌బాల్ లీగ్ ఆడే సమయంలోనే మా కోచ్ స్ట్రైకర్ ప్రాధాన్యం చెప్పారు. మొదట్లో స్ట్రైకర్ రోల్ ఏంటో నాకు అస్సలు తెలిసేది కాదు. ఆ ప్లేస్ ప్రాధాన్యం తెలిశాక.. నాకు అదే కరెక్ట్ రోల్ అనిపించింది. ఆ లీగ్ ద్వారా నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను.