Jasprit Bumrah : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యపై భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్పందించాడు. స్వాతంత్ర దినోత్సవం రోజున అతడు దేశ ప్రజలకు గట్టి సందేశం ఇచ్చాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టిన బుమ్రా.. దేశంలోని అమ్మాయిలకు, మహిళలకు తమ దారిని, గమ్యాన్ని మార్చుకోవాలని చెప్పకండని హితవు పలికాడు.
అంతేకాదు ప్రతి మహిళకు గొప్పగా బతికే హక్కు ఉందని ఈ యార్కర్ కింగ్ అన్నాడు. దాంతో, బుమ్రా పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. ఆ పోస్ట్ చూసిన అభిమానులు, క్రికెటర్లు బుమ్రా నువ్వు నిజం చెప్పావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Jasprit Bumrah’s Instagram story . 🙏 pic.twitter.com/xMf6lObHQq
— ` (@FourOverthrows) August 15, 2024
కోల్‌కతాలోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్(RG Kar Medical College And Hospital)కు చెందిన 31 ఏండ్ల శిక్షణ వైద్యురాలు ఆగస్టు 9న దారుణంగా హత్యకు గురైంది. అయితే.. హాస్పత్రి యాజమాన్యం తొలుత మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది అని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. కానీ, పోస్ట్ మార్టమ్ నివేదికలో ఆమె అత్యాచారానికి గురైందని తేలింది. దాంతో, కోల్‌కతాలో అగ్గి రాజుకుంది. చివరకు సంజయ రాయ్ అనే వాలంటీర్ ఆమెపై అత్యాచారం చేసి కిరాతంగా చంపేశాడని పోలీసులు గుర్తించారు దాంతో, దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, నర్సులు గత మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.