దుబాయ్ : టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. 2024కు గాను అతడు అత్యుత్తమ టెస్టు క్రికెటర్‌గా నిలిచాడు. ఈ అవార్డు రేసులో జో రూట్, హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్ (శ్రీలంక)ను వెనక్కినెట్టిన బుమ్రా.. అవార్డుకు ఎంపికైనట్టు ఐసీసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది 13 టెస్టులాడిన బుమ్రా.. ఏకంగా 71 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ను బెంబేలెత్తించిన బుమ్రా.. కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియాలో కంగారూలను ముప్పుతిప్పలు పెట్టి 5 టెస్టుల్లో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. భారత్ నుంచి ఈ అవార్డు అందుకున్న క్రికెటర్లలో బుమ్రా ఆరో వ్యక్తి. గతంలో ద్రవిడ్, గంభీర్, సెహ్వాగ్, అశ్విన్, కోహ్లీ ఈ జాబితాలో ఉన్నారు. ఐసీసీ ఇటీవలే ప్రకటించిన అత్యుత్తమ టెస్టు క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న బుమ్రా.. తాజాగా అదే ఫార్మాట్లో బెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. అంతేగాక అతడు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ రేసులోనూ ఉన్నాడు. మంగళవారం ఆ ఫలితాలు వెలువడాల్సి ఉంది.
మహిళల విభాగంలో ఓపెనర్ స్మృతి మంధాన.. అత్యుత్తమ వన్డే క్రికెటర్‌గా నిలిచింది. 2024లో ఆమె 13 ఇన్నింగ్స్‌లలో 747 పరుగులు సాధించింది. మంధాన ఇది వరకే ఐసీసీ ఉమెన్స్ టీ20 జట్టులో స్థానం సంపాదించుకున్న విషయం విదితమే. పురుషుల విభాగంలో అత్యుత్తమ వన్డే క్రికెటర్‌గా అఫ్గానిస్థాన్ క్రికెటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఎంపికయ్యాడు.