ముంబై: ముంబై ఇండియన్స్ ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah).. ఈసారి ఐపీఎల్లో ఆడేది డౌట్‌గా ఉన్నది. ప్రస్తుతం వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న అతను .. ఈ యేడాది ఐపీఎల్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లు మిస్ అవుతాడన్న సంకేతాలు అందాయి. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే మార్చి 23వ తేదీన చెన్నైతో చెన్నైలోనే మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఆడనున్నది. ఆ మ్యాచ్ వరకు బుమ్రా రెఢీ అవుతాడా కాదా అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.
ఓ రిపోర్టు ప్రకారం అతను ఇంకా ఫిట్ కాలేదన్న విషయం స్పష్టం అవుతోంది. చెన్నైతో మ్యాచ్ తర్వాత 29వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తలపడనున్నది. ఇక ఆ మ్యాచ్‌కు కూడా బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు అని ఇవాళ ఓ క్రికెట్ వెబ్సైట్ తన రిపోర్టులో పేర్కొన్నది. స్ట్రెస్ ఇంజ్యూరీ నుంచి బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ బుమ్రా.. ఈనెల చివర లేదా వచ్చే నెల ఆరంభంలో ముంబై జట్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నట్లు ఆ రిపోర్టులో తెలిపారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ సమయంలో బుమ్రా గాయపడ్డాడు. సిడ్నీ టెస్టులో అతను రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా చేయలేదు. ఆ సిరీస్‌లో 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే తాజాగా బీసీసీఐకి చెందిన మెడికల్ టీమ్ ఇచ్చే నివేదిక ఆధారంగా బుమ్రా.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇంతకీ బుమ్రా ఎన్ని మ్యాచ్‌లు ఆడుతాడో ఇప్పుడే చెప్పలేం, కానీ ఆలస్యంగానైనా జట్టులో చేరే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు తన హోంగ్రౌండ్లో తొలి మ్యాచ్‌లో మార్చి 31వ తేదీన కోల్‌కతాతో ఆడనున్నది.