Asia Cup | టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వచ్చే నెలలో జరుగనున్న ఆసియా కప్ ఆడనున్నాడు. ఈ మేరకు అందుబాటులో ఉంటానని సెలెక్టర్లకు సమాచారం అందించినట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న ముంబయిలో సమావేశమై ఆసియా కప్ కోసం 15 మందితో జట్టును ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరుగనున్నది. ఈ సారి ఈ టోర్నమెంట్ టి20 ఫార్మాట్లో జరుగుతుంది. ఆసియా కప్ ఆడుతానని బుమ్రా సెలెక్టర్లకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారం చివరలో సెలక్షన్ కమిటీ సభ్యులు సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
బుమ్రా చివరిసారిగా ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల మ్యాచుల్లో మూడు మాత్రమే ఆడిన విషయం తెలిసింది. పని భారం నేపథ్యంలో కేవలం మూడు మ్యాచులు ఆడాడు. అండర్సన్-సచిన్ టెండూల్కర్ సిరీస్లో చివరిదైన ఐదో టెస్టుకు ముందు బుమ్రాను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్ ఆడిన బుమ్రాకు రెండో టెస్టులో విశ్రాంతి ఇచ్చారు. అనంతరం మూడు, నాలుగు టెస్టులకు అందుబాటులో ఉన్నాడు. ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టుకు దూరంగా ఉన్నాడు. ఈ టెస్ట్ సిరీస్లో బుమ్రా మొత్తం 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.
చాలాకాలం తర్వాత టీ20 ఫార్మాట్లో కనిపించనున్నాడు. టీ20ల్లో ఎక్కువగా ఓవర్లు స్పెల్స్ వేయాల్సిన అవసరం ఉండదు. దాంతో ఏ మ్యాచ్లో విశ్రాంతి ఇవ్వాలో నిర్ణయించుకునే అవకాశం కూడా టీమ్ మేనేజ్మెంట్కు ఉంటుంది. ఆసియా కప్ ప్రారంభానికి, చివరి మ్యాచ్ ఆడిన మ్యాచ్కు మధ్య బుమ్రాకు 40 రోజుల విరామం ఉంటుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్లో బుమ్రా భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్లో మిస్టరీ బౌలర్ 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆసియా కప్ కోసం భారత జట్టు త్వరలోనే యూఏఈ చేరుకోనున్నది. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే ఆసియాకప్కి వెళ్లబోతున్నారు. దాంతో బెంగళూరులో స్వల్పకాలిక శిబిరం ఏర్పాటు చేయాలకుంటున్నారా? అని బీసీసీఐ టీమ్ మేనేజ్మెంట్ను కోరింది. అయితే, ఆటగాళ్లు పరిస్థితులకు అలవాటు పడటానికి కొంచెం ముందుగానే యుఏఈ చేరుకోవడం మంచిదని జట్టు యాజమాన్యం భావిస్తోంది. శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి బదులుగా, టోర్నమెంట్ ప్రారంభానికి ముందు వారు మంచి ప్రాక్టీస్ చేయగలిగితే జట్టు మూడు-నాలుగు రోజుల ముందుగానే యూఈకి వెళ్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.