బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య గబ్బా ఫైట్ రసవత్తరంగా సాగుతున్నది. వరుణుడి అంతరాయం మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్నది. ఆసీస్ బౌలర్ల ధాటికి సహచర బ్యాటర్లు విఫలమైన వేళ కేఎల్ రాహుల్, జడేజా అర్ధసెంచరీలతో కదంతొక్కారు. ఆసీస్ బౌలింగ్ దాడిని దీటుగా ఎదుర్కొంటూ కీలక ఇన్నింగ్స్ ఆడారు. పోరాడితే పోయేదేమి లేదన్న తరహాలో వీరిద్దరికి తోడు ఆఖర్లో ఆకాశ్‌దీప్, బుమ్రా అడ్డుగోడలా నిలువడంతో ఫాలోఆన్ గండం తప్పింది. కంగారూల సహనానికి పరీక్ష పెడుతూ ఆకాశ్, బుమ్రా బ్యాటింగ్ భారత అభిమానులకు మంచి కిక్కిచ్చింది. స్వల్ప స్కోరుకే పరిమితం చేద్దామనుకున్న ఆసీస్ ఆశలపై నీళ్లు గుమ్మరిస్తూ టీమ్ఇండియాను పోటీలోకి తీసుకొచ్చి గబ్బాపై పట్టు నిలుపుకున్నారు.
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు అభిమానులను అలరిస్తున్నది. ఓవైపు వరుణుడు అంతరాయం కల్గిస్తున్నా.. ఇరు జట్లు తమ పోరాటాన్నే నమ్ముకున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా స్వింగ్ రాబడుతూ భారత్‌ను ఆలౌట్ చేద్దామనుకున్న ఆసీస్ ఆశలు నెరవేరలేదు. ఓవర్‌నైట్ స్కోరు 51/4తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన టీమ్ఇండియా 9 వికెట్లకు 252 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(139 బంతుల్లో 84, 8ఫోర్లు), జడేజా(123 బంతుల్లో 77,7ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో విజృంభించారు. ప్రధాన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన వేళ ఈ ఇద్దరు అద్భుత పోరాట పటిమ కనబరిచారు. ఓవైపు వికెట్లు పడుతున్నా..వెరవకుండా విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. చివర్లో ఆకాశ్‌దీప్‌సింగ్(31 బంతుల్లో 27 నాటౌట్, 2ఫోర్లు, సిక్స్), బుమ్రా(27 బంతుల్లో 10 నాటౌట్, సిక్స్) ఆసీస్ బౌలర్లను విసిగెత్తించారు. ఓవైపు హాజిల్‌వుడ్ గాయంతో మ్యాచ్ మధ్యలోనే వెనుదిరుగగా, ఆ భారాన్ని కమిన్స్(4/54), స్టార్క్(3/83), లియాన్(1/54) మోశారు. ఇప్పటికే ఫాలోఆన్ గండం నుంచి బయటపడ్డ టీమ్ఇండియా..193 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది. బుధవారం ఆటకు ఆఖరి రోజు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా..ఫలితం వచ్చే అవకాశం లేదు.
తామేంత విలువైన ప్లేయర్లమో కేఎల్ రాహుల్, జడేజా మరోమారు నిరూపించుకున్నారు. ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ మంచి పరిణతి కనబర్చగా, జడేజా..ఆఖరి వరుస ప్లేయర్లతో కలిసి బ్యాటింగ్ కొనసాగించాడు. నాలుగో రోజు కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే రాహుల్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో స్మిత్ వదిలిపెట్టాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న రాహుల్..మరోమారు అలాంటి అవకాశమివ్వలేదు. పిచ్‌పై స్వింగ్‌ను అంచనా వేస్తూ మంచి బంతులను గౌరవిస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఏ బంతిని షాట్ ఆడాలో, ఏ బంతిని విడిచిపెట్టాలో కచ్చితంగా అంచనా వేస్తూ రాహుల్ బ్యాటింగ్ చేశాడు. మరో ఎండ్‌లో తన ఫామ్ లేమిని కొనసాగిస్తూ కెప్టెన్ రోహిత్(10) కమిన్స్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ తరుణంలో క్రీజులోకొచ్చిన జడేజాతో రాహుల్ జతకలిశాడు. వీరిద్దరు కంగారూ బౌలింగ్ దాడిని తిప్పికొడుతూ కీలక పరుగులు జోడించారు. లియాన్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్మిత్ క్యాచ్‌తో రాహుల్ ఔట్ కావడంతో ఆరో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ బాధ్యతను జడేజా భుజానేసుకున్నాడు. నితీశ్(16)తో కలిసి అర్ధసెంచరీతో మార్క్ అందుకున్నాడు. అయితే నితీశ్, జడేజాను కమిన్స్ ఔట్ చేయగా, సిరాజ్(1)ను స్టార్క్ బుట్టలో వేసుకున్నాడు. ఇక్కడి నుంచి ఆకాశ్‌దీప్, బుమ్రా పట్టువదలకుండా పోరాడారు. ముఖ్యంగా ఆకాశ్‌దీప్ ఆత్మవిశ్వాసంతో పరుగులు కొల్లగొట్టాడు. ఫాలోఆన్ మార్క్ దాటగానే టీమ్ఇండియా డగౌట్లో ప్లేయర్లు సంబురాలు చేసుకున్నారు. వీరిద్దరు 10 వికెట్‌కు 39 పరుగుల అజేయ భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్,
భారత్ తొలి ఇన్నింగ్స్: 252/9(రాహుల్ 84, జడేజా 77, కమిన్స్ 4/80, స్టార్క్ 3/83)