సహచరులంతా విఫలమైన చోట యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్వితీయ బ్యాటింగ్‌తో అదరగొడితే.. బౌలింగ్‌లో ఆ బాధ్యత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తీసుకున్నాడు. బ్యాట్‌తో జైస్వాల్ డబుల్ సెంచరీ బాదితే.. బంతితో బుమ్రా ఆరు వికెట్లతో ఇంగ్లిష్ టీమ్‌ను అల్లాడించాడు!
జీవం లేని ఫ్లాట్ పిచ్! పేసర్లకు తోడ్పాటు లేదు.. స్పిన్నర్లకు సహకారం లేదు అనుకుంటున్న సమయంలో బంతిని గాల్లోనే రివర్స్ స్వింగ్ చేస్తూ చెలరేగిన బుమ్రా.. ఇంగ్లండ్ వెన్ను విరిచాడు. నభూతో అనదగ్గ బంతితో ఓలీ పోప్ వికెట్లు చెల్లాచెదురు చేసిన బుమ్రా.. ఓ అద్భుత డెలివరీతో బెన్ స్టోక్స్‌ను బోల్తా కొట్టించాడు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని స్టోక్స్ బ్యాట్ కింద పడేసి.. ‘ఏంటీ బాస్ ఇదీ’ అన్నట్లు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒక్కటి చాలు ఈ ఇన్నింగ్స్‌లో జెస్సీ బౌలింగ్ ఎలా సాగిందో చెప్పేందుకు!!
Ind Vs Eng Test | విశాఖపట్నం: తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న టీమ్ఇండియా.. రెండో పోరుపై పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన ఆతిథ్య జట్టు.. ప్రత్యర్థిని 253 పరుగులకే ఆలౌట్ చేసి మంచి ఆధిక్యం మూటగట్టుకుంది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (290 బంతుల్లో 209; 19 ఫోర్లు, 7 సిక్సర్లు) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 336/6తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఆఖరికి 396 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ (20) కాస్త సహకరించగా.. జైస్వాల్ ద్విశతకం పూర్తి చేసుకున్నాడు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ‘బజ్‌బాల్’ ఆటతీరుతో 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలీ (78 బంతుల్లో 76; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (47) పోరాడాడు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో అదరగొట్టగా.. కుల్దీప్ 3 వికెట్లు తీశాడు. దీంతో భారత జట్టుకు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ఓవరాల్‌గా టీమ్ఇండియా 171 పరుగుల ముందుండగా.. జైస్వాల్ (15), రోహిత్ (13) క్రీజులో ఉన్నారు. ఉప్పల్ టెస్టులో భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కినా.. చివరకు మ్యాచ్ ఓడిన రోహిత్‌సేన.. వైజాగ్‌లో మూడో రోజంతా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తేనే సిరీస్ సమం కానుంది.
బూమ్ బూమ్ బుమ్రా! నిర్జీవ పిచ్‌పై నిప్పులు చెరిగే నైపుణ్యం.. ఫ్లాట్ వికెట్‌పై బంతిని షేక్ చేయగల సత్తా ఉంటే.. భారత గడ్డపై పేసర్లు కూడా వికెట్లు తీయోచ్చని బుమ్రా నిరూపించాడు!
నేల నుంచి సహకారం లభించకపోతే.. నింగే తనకు హద్దు అన్నట్లు.. గాల్లోనే బంతి నుంచి రివర్స్ స్వింగ్ రాబడుతూ వైజాగ్‌లో బుమ్రా రచించిన విధ్వంసకాండ మాటలకందనిది. ప్రత్యర్థి బ్యాటర్లు పాతుకు పోతున్నారనుకున్న ప్రతిసారి.. సారథి రోహిత్ బంతిని బుమ్రా వైపు విసరడం.. అతడు వచ్చి భాగస్వామ్యాన్ని విడగొట్టడం సాగర తీరాన ఇదే సీన్ రిపీట్ అయింది. ఉప్పల్ టెస్టులో అసమాన పోరాటంతో ఇంగ్లండ్ టీమ్‌కు ఒంటిచేత్తో విజయాన్నందించిన ఓలీ పోప్‌కు బుమ్రా సంధించిన బంతైతే.. ఎంతటి మొనగాడినైనా మోకాళ్లపై కూర్చోబెట్టేదే.
ఆడేందుకు కాదు కదా కనీసం అడ్డుకునేందుకు కూడా వీలు లేకుండా.. యార్కర్ అంటే ఎలా ఉంటుందో రుచిచూపిస్తూ.. పోప్ వికెట్లను నేలపాలు చేసిన బుమ్రా.. ఇంగ్లండ్ సారథి స్టోక్స్‌తో సలాం కొట్టించుకున్నాడు. గత మ్యాచ్‌లోనూ స్టోక్స్‌ను దిమ్మతిరిగే బంతితో బౌల్డ్ చేసిన బుమ్రా.. ఈ సారి డోసు మరింత పెంచి ఆశ్చర్యచకితుడిని చేశాడు. సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి తుది జట్టులోకి తీసుకున్న మరో పేసర్ ముఖేశ్ కుమార్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్న చోట బుమ్రా తన విలువ చాటుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ జెస్సీ జోరు ఇలాగే కొనసాగితే మ్యాచ్ మన వశమైనట్లే!
10 టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం బుమ్రాకు ఇది పదోసారి.
2 వేగంగా 150 వికెట్లు పడగొట్టిన రెండో ఆసియా బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. వకార్ యూనిస్ ముందున్నాడు.
3 పిన్నవయసు (22 సంవత్సరాల 36 రోజులు)లో డబుల్ సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్‌గా జైస్వాల్ నిలిచాడు. వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 396 (జైస్వాల్ 209, గిల్ 34; అండర్సన్ 3/47, రేహాన్ 3/65),
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 253 (క్రాలీ 76, స్టోక్స్ 47; బుమ్రా 6/45, కుల్దీప్ 3/71),
భారత్ రెండో ఇన్నింగ్స్: 5 ఓవర్లలో 28/0 (జైస్వాల్ 15 నాటౌట్, రోహిత్ 13 నాటౌట్).