Ravindra Jadeja : లార్డ్స్‌లో గెలవాల్సిన మ్యాచ్‌ను భారత జట్టు చేజార్చుకుంది. ప్రధాన బ్యాటర్లు విఫలమైన దశలో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అసమాన పోరాటంతో టీమ్‌ను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డాడు. టెయిలెండర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన అతడు ఇంగ్లండ్ వెన్నులో వణుకుపుట్టించాడు. చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన జడ్డూ శ్రమకు తగిన గుర్తింపు దక్కింది. ఈ వెటరన్ ప్లేయర్‌ను ఆకాశానికెత్తేసిన ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (MVP) ట్యాగ్ ఇస్తున్నామని చెప్పాడు.
‘లార్డ్స్ టెస్టులో ఐదోరోజు భారత టెయిలెండర్లు గొప్ప ప్రదర్శన చేశారు. ముఖ్యంగా జడేజా అద్భుత పోరాటం కనబరిచాడు. అందకే అతడు టీమిండియాకు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ అని గౌతీ అన్నాడు. సహాయక కోచ్ రియాన్ టెన్ డస్చేట్ సైతం ఇదే అభిప్రాయం వెలిబుచ్చాడు. ‘లార్డ్స్ మైదానంలో జడేజా బ్యాటింగ్ వేరే లెవల్లో సాగింది. గత రెండు మ్యాచుల్లో అతడు నిలకడగా రాణించాడు. జడ్డూ డ్రెస్సింగ్ రూమ్‌కు ప్రశాంతత తీసుకొచ్చాడు. నేను కొన్ని ఏళ్లుగా అతడిని గమనిస్తున్నా. జడేజా ఆటలో ఎంతో పరిణతి సాధించాడు. నిఖార్సైన బ్యాటర్‌గా అవతరించాడు’ అని డస్చేట్ వెల్లడించాడు.
𝗧𝗵𝗲 𝗠𝗩𝗣; 𝗳𝘁. 𝗥𝗮𝘃𝗶𝗻𝗱𝗿𝗮 𝗝𝗮𝗱𝗲𝗷𝗮 🔝
WATCH 🎥🔽 #TeamIndia | #ENGvIND | @imjadeja
— BCCI (@BCCI) July 18, 2025
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో కంగుతిన్న భారత జట్టు బర్మింగ్హమ్లో పంజా విసిరింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో కదం తొక్కగా.. పేసర్ ఆకాశ్ దీప్ 9 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్రాత్మక విజయంతో సిరీస్ సమం చేసిన టీమిండియా.. లార్డ్స్‌లోనూ ప్రత్యర్థికి దడ పుట్టించింది. కేఎల్ రాహుల్ శతకంతో భారీ స్కోర్‌కు బాటలు వేయగా.. బుమ్రా ఐదు వికెట్లతో బెన్ స్టోక్స్ బృందాన్ని కుప్పకూల్చాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 192కే ఆలౌట్ చేసి సిరీస్‌లో పైచేయి సాధించే అవకాశాల్ని సృష్టించుకుంది. కానీ, నాలుగో రోజు కార్సే, ఆర్చర్ విజృంభణతో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదో రోజు మిడిలార్డర్ కూడా అదే తడబాటు కొనసాగించగా రవీంద్ర జడేజా (61 నాటౌట్) ఒంటరి సైనికుడిలా పోరాడాడు. ఏడో స్థానంలో క్రీజులోకి వచ్చిన అతడికి నితీశ్, బుమ్రా, సిరాజ్‌లు సహకరించగా విజయానికి చేరువైంది. 22 పరుగులు అవసరమైన వేళ బషీర్ బౌలింగ్‌లో చివరి బంతిని సిరాజ్ సమర్ధంగా అడ్డుకున్నాడు. కానీ, బంతి బౌన్స్ అవుతూ లెగ్ సైడ్ వికెట్లను తాకింది. అంతే… ఉత్కంట పోరులో గెలుపుతో చరిత్ర సృష్టించాలనుకున్న గిల్ సేన కల చెదిరింది.
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదిన జడ్డూ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 58 రన్స్ కొడితే ఇంగ్లండ్‌పై 1,000 పరుగులతో దిగ్గజం గ్యారీఫీల్డ్ సోబర్స్ సరసన చేరుతాడు జడేజా. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జూలై 23న మాంచెస్టర్‌లో నాలుగో టెస్టు జరుగనుంది.