Ban On Cricket : గతంలో కొన్ని దేశాలకే పరిమితమైన క్రికెట్(Cricket) ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. చిన్నపిల్లల నుంచి నడివయసు వాళ్ల వరకూ సమయం దొరికితే చాటు బ్యాట్, బాల్ అందుకుంటారు. గల్లీల్లో, ఇరుకు వీధుల్లో బుల్లి క్రికెటర్లు ఎందరో మనకు కనిపిస్తుంటారు. ఈ టీ20ల యుగంలో క్రికెట్ మరింత పాపులర్ అవుతున్న వేళ.. యూరప్(Europe) దేశాల్లోని ఓ నగరం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రాంతంలో క్రికెట్‌పై నిషేధం విధించింది.
ఒకవేళ ఎవరైనా ఈ కట్టుబాటును ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఇదెక్కడి విడ్డూరం? అసలు ఈ నగరం దునియాలో ఎక్కడుంది? వంటివి తెలుసుకోవాలనుందా.. అయితే ఇంకెందుకాలస్యం.. చదివేయండి. ఇటలీలోని మొన్‌ఫాల్కొనే (Monfalcone) అనే నగరం ప్రకృతి అందాలకు నెలవు. అడ్రియాటిక్ సముద్రపు ఒడ్డున గల ఈ సిటీ చాలా చూడముచ్చటగా ఉంటుంది. అంతా కలిపితే 30 వేలకు మించని జనాభా. మరి.. క్రికెట్‌పై నిషేధం ఎందుకంటే..?
మొన్‌ఫాల్కొనే నగరం

క్రికెట్ పిచ్ (Cricket Pitch) తయారీకి పెద్దమొత్తంలో డబ్బులు కావాలి. పైగా మ్యాచ్‌ల నిర్వహణకు ఓ చిన్నపాటి స్టేడియం(Mini Stadium) అయినా అవసరం. కానీ, పిచ్ తయారీకి ఆ నగరం మున్సిపల్ ఖజానాలో డబ్బులు లేవు. స్టేడియం నిర్మాణానికి అవసరమైన భారీ స్థలంగానీ మొన్ఫాల్కొనేలో లేదు. పైగా క్రికెట్ ఆడే సమయంలో బంతి తగిలితే పెద్ద ప్రమాదమే. అందుకనే మేయర్ అన్నా మరియా సిసింట్ (Anna Maria Cisint) క్రికెట్‌ను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో నిషేధం విధించారు.
మేయర్ అన్నా మరియా సిసింట్

నగరవాసులు ఎవరూ క్రికెట్ ఆడొద్దని ఆమె హుకూం జారీ చేశారు. తమ మాటను పెడ చెవిన పెడుతూ ఎవరైనా క్రికెట్ ఆడినట్టు తెలిస్తే.. భారీ జరమానా తప్పదని మేయర్ అన్నా మరియా ప్రజలను హెచ్చరించారు. అయినా సరే ఎవరైనా క్రికెట్ బ్యాటు, బంతితో కంటపడితే.. 100 యూరోలు (భారతీయ కరెన్సీలో రూ.9 వేలు) ఫైన్ వేస్తామని ఆమె స్పష్టం చేశారు.
మేయర్ నిర్ణయంపై మొన్‌ఫాల్కొనే ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పెద్దవాళ్లు ఆమె వైఖరిని అభినందిస్తున్నారు. కానీ.. కుర్రాళ్లు మాత్రం తప్పు పడుతున్నారు. ‘నగరంలో జాగ లేదని చెప్పి క్రికెట్‌పై నిషేధం విధించడం ఏంటీ?’ అని మేయర్ మరియా తీరును వాళ్లు విమర్శిస్తున్నారు.