తిరుమల : తిరుమల (Tirumala) లో వేంకటేశ్వరస్వామిని ఆగస్టు నెలలో 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. భక్తులు సమర్పించుకున్న హుండీ కానుకలు స్వామివారి హుండీకి రూ.125.67 కోట్లు ఆదాయం(Income) వచ్చిందన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు సమాచార కేంద్రాలలో లడ్డూ ప్రసాదాలను శాశ్వతంగా విక్రయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆయా ఆలయాలలో ఇందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తిరుమలలో లడ్డూ దళారులను కట్టడి చేయడం ద్వారా, బయట ప్రాంతాలకు లడ్డూ ప్రసాదాలు పంపుతున్నట్లు వివరించారు. ఆగస్టులో 1.06 కోట్ల లడ్డూలను విక్రయించామని ఆయన పేర్కొన్నారు. 24.33 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని వివరించారు. 9.49 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు.