County Cricket | భారత క్రికెటర్లు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో అదరకొడుతున్నారు. ఇషాన్ నాటింగ్‌హామ్‌షైర్ తరఫున, తిలక్ హాంప్‌షైర్ తరఫున ఆడుతున్నారు. తిలక్ మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 176 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ కూడా ఉన్నది. ఇషాన్ రెండు ఇన్నింగ్స్‌లో 164 పరుగులు చేశాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో తిలక్ భారత జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే, 2022లో జట్టు నుంచి ఉద్వాసనకు గురైన ఇషాన్ కిషన్ తిరిగి జాతీయ జట్టులో చేరుకోలేకపోయాడు. కౌంటీల్లో రాణిస్తున్న నేపథ్యంలో టెస్టుల్లోకి మళ్లీ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్నది. జట్టులో ఎవరైనా ఆటగాళ్లు గాయపడితే వారి స్థానం దక్కే అవకాశాలున్నాయి.
తిలక్ హాంప్‌షైర్ తరపున ఎసెక్స్‌తో తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 241 బంతుల్లో 100 పరుగులు చేశాడు. హాంప్‌షైర్-ఎసెక్స్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత హాంప్‌షైర్ -వొర్సెస్టర్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తిలక్ 171 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 679 పరుగులు చేసిన తర్వాత వొర్సెస్టర్‌షైర్ డిక్లేర్ చేసింది. అదే సమయంలో తిలక్ అర్ధ సెంచరీ చేసినప్పటికీ, హాంప్‌షైర్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు కుప్పకూలింది. ఆ ప్రస్తుతం ఆ జట్టు ఫాలో ఆన్ ఆడుతున్నది. ఫాలో-ఆన్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి, హాంప్‌షైర్ మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. తిలక్ 20 పరుగులతో, కెప్టెన్ బెన్ బ్రౌన్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇషాన్ కిషన్ నాటింగ్హైర్ తరపున యార్క్‌షైర్‌తో తన తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హ్యామ్షైర్ మొదటి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసింది. కిషన్ 98 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు రాలేదు. ఆ తర్వాత, నాటింగ్‌హామ్‌షైర్ జట్టు సోమర్‌సెట్‌తో మ్యాచ్ ఆడుతున్నది. సోమర్సెట్ మొదట బ్యాటింగ్ చేసి 379 పరుగులు చేసింది. బదులుగా నాటింగ్‌హామ్‌షైర్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 509 పరుగులు చేసింది. కిషన్ 128 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 77 పరుగులు చేశాడు. ప్రస్తుతం, సోమర్సెట్ రెండో ఇన్నింగ్స్ కొనసాగుతున్నది.