తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో అదరగొడుతున్నది. జాతీయ సీనియర్ టోర్నీలో రజత పతకంతో మెరిసిన ఇషా..టోర్నీ టోర్నీకి మరింత మెరుగవుతున్నది. ఆసియా గేమ్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్న ఇషాసింగ్ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఆమె మాటల్లోనే..
జాతీయ టోర్నీలో మీ ప్రదర్శనపై?
భోపాల్ వేదికగా ఆసియా గేమ్స్‌కు అర్హత టోర్నీగా సాగుతున్న జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలువడం చాలా సంతోషంగా ఉంది. రాహీ సర్నోబత్ లాంటి సీనియర్ షూటర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైనా రౌండ్ రౌండ్‌కు కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాను. కేవలం పాయింట్ తేడాతో సర్నోబత్కు పసిడి చేజార్చుకున్నాను. ఆసియా గేమ్స్ సమీస్తున్న వేళ ప్రతీ టోర్నీ కీలకమైన నేపథ్యంలో సహచర షూటర్ల నుంచి తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొన్నది.
తదుపరి లక్ష్యమేంటి?
నా కెరీర్లో ఇప్పటి వరకు సుదూర లక్ష్యాలను ఎంచుకున్నది ఎప్పుడు లేదు. ఎంపిక చేసుకున్న టోర్నీల్లో పోటీకి దిగుతూ పతకాలు సాధించడాన్ని అలవాటుగా మార్చుకున్నాను. అంతేగానీ భవిష్యత్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుంటూ ఒత్తిడికి లోనైతే అనుకున్న ఫలితాలను సాధించలేం. మనసు పెట్టి ఆడే ఈ ఆటలో మానసికంగా ధృడంగా ఉండటం చాలా కీలకం. ఈ నెల ఆఖర్లో ఢిల్లీలో జాతీయ టోర్నీ ఆ తర్వాత ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్, సెప్టెంబర్‌లో ఆసియా గేమ్స్ ఉన్నాయి. ఆసియా గేమ్స్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలన్న కలను సాకారం చేసుకోవాలనుకుంటున్నా.
ప్రభుత్వ ప్రోత్సాహంపై మీ స్పందన?
సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెండైన ప్రోత్సాహం లభిస్తున్నది. ప్రతిభకు తగిన విధంగా భారీ నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రభుత్వ మద్దతుతో భవిష్యత్‌లో రాష్ట్ర, దేశ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేలా రాణిస్తానన్న నమ్మకం నాకుంది. అందుకు తగ్గట్లు ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నాను. నా ఈ ప్రయాణంలో సహకరిస్తున్న అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
శిక్షణ ఎలా సాగుతోంది?
వేద ప్రకాశ్ సార్ దగ్గర నేను శిక్షణ తీసుకుంటున్నాను. మాజీ భారత ఆర్మీ అధికారి అయిన ప్రకాశ్ గత మూడేండ్లుగా మాకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో మరింత రాటుదేలుతున్నాం. వివిధ దేశాల షూటర్ల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతున్నాం.