కావలసిన పదార్థాలు
పెద్ద బజ్జీ మిర్చి: పది
చిలగడ దుంపలు: మూడు
నిమ్మకాయ: ఒకటి
కారం: అరస్పూను
పసుపు: పావు స్పూను
కొత్తి మీర తరుగు: అరకప్పు
నూనె: మూడు టీ స్పూన్లు
ఉప్పు: టీ స్పూను
తయారు చేసే విధానం
ముందుగా బజ్జీ మిర్చీలను శుభ్రంగా కడిగి మధ్యలోకి పొడుగ్గా చీల్చుకోవాలి. చిలగడ దుంపల్ని ఉడికించి చెక్కు తీసి, బాగా మెత్తగా మెదుపుకోవాలి. అందులో కొత్తిమీర తరుగు, నూనె, ఉప్పు, పసుపు, కారం వేసుకుని సమంగా కలపాలి. బజ్జీ చేసేందుకు సిద్ధమయ్యే ముందు ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పొడుగ్గా చీల్చిన బజ్జీ మిరపకాయల్లో కూరాలి. పొయ్యి మీద పెనం పెట్టి, కొద్దిగా నూనె చిలకరించి దాని మీద ఈ మిరపకాయల్ని పరవాలి. మూత పెట్టి మాగిన దాకా ఉంచి తిప్పుతూ కాల్చుకోవాలి. అంతే, ఎక్కువ నూనె లేకుండా, తీపి కారాల కలయికతో రుచిగా ఉండే స్వీట్ పొటాటో స్టఫ్డ్ బజ్జీ సిద్ధమైపోతుంది!
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు