సౌథాంప్టన్: ఇండియన్ టీమ్ స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలుసు కదా. ఈమె స్టార్ నటుడు సునీల్ శెట్టి కూతురు. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై నోరు విప్పకపోయినా.. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లడం, కలిసి సెల్ఫీలకు పోజులివ్వడం, సోషల్ మీడియాలో వాటిని షేర్ చేయడం చూస్తుంటే వీళ్ల లవ్‌స్టోరీ పెళ్లి పీటలు ఎక్కడానికి పెద్దగా టైమ్ పట్టేలా కనిపించడం లేదు. ప్రస్తుతం రాహుల్ టీమిండియాతో కలిసి ఇంగ్లండ్ వెళ్లాడు. టీమ్ సౌథాంప్టన్‌లో ఉంది. అక్కడికి వెళ్లినప్పటి నుంచి కెప్టెన్ కోహ్లితోపాటు పలువురు ప్లేయర్స్ ఎజియస్ బౌల్ స్టేడియంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా రాహుల్ గర్ల్‌ఫ్రెండ్ అతియా కూడా ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఫొటో అయినా సరే ఆమె వెనుక బ్యాక్‌గ్రౌండ్‌ను ఫ్యాన్స్ పట్టేశారు. ఇది ప్రస్తుతం టీమ్ ఉంటున్న ఎజియస్ బౌల్ స్టేడియంలాగే ఉందే అని కామెంట్ చేశారు. అంతకుముందు రాహుల్ కూడా అక్కడి ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో రాహుల్ తనతోపాటు గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా వెంట తీసుకెళ్లాడని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. నాలుగు నెలల టూర్ కావడంతో ఈసారి ప్లేయర్స్ తమ ఫ్యామిలీస్‌ను వెంట తీసుకెళ్లడానికి బీసీసీఐ, ఇంగ్లండ్ ప్రభుత్వం కూడా అంగీకరించింది.