Simi Singh : ఐర్లాండ్ క్రికెటర్ సిమీ సింగ్ (Simi Singh)కు ప్రాణాపాయం తప్పింది. కాలేయం(Liver) పాడవ్వడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన అతడికి భార్య అగమ్‌దీప్ కౌర్(Agamdeep Kaur) ప్రాణం పోసింది. తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చి సిమీని కాపాడుకుంది. గురుగ్రామ్‌లోని మెదంతా హాస్పిటల్ వైద్యులు సిమీకి గురువారం కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఐసీయూలోనే ఉన్న అతడు వేగంగా కోలుకుంటున్నాడని డాక్టర్లు చెప్పారు.
అసలేం జరిగిందంటే..? భారత్‌కు చెందిన సిమీ సింగ్ ఐర్లాండ్ తరఫున ఆడుతున్నాడు. ఆరు నెలల క్రితం సిమీ తీవ్రమైన జ్వరం వచ్చింది. దాంతో, వెంటనే ఐర్లాండ్ క్రికెట్ సిబ్బంది అతడిని డబ్లిన్‌లోని పెద్ద దవాఖానలో చేర్పించారు. కానీ, అక్కడి వైద్యులకు ఆ జ్వరం ఏంటో అంతుచిక్కలేదు. దాంతో, వాళ్లు సిమీకి చికిత్స చేయలేమని తేల్చి చెప్పారు. దాంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో సిమీ స్వదేశం వచ్చేశాడు.
సిమీ సింగ్
ఐర్లాండ్ నుంచి రాగానే సిమీని హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానలో అడ్మిట్ చేశారు. అతడిని అన్ని పరీక్షలు చేసిన వైద్యులు కాలేయం పనితీరు ఆ జ్వరానికి కారణమని కనుగొన్నారు. కాలేయాన్ని మార్పిడి చేస్తే తప్ప బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. అందువల్ల అతడి భార్య అగమ్‌దీప్ తన కాలేయాన్ని కొంత వరకూ ఇచ్చేందుకు సిద్ధపడింది. 2017లో ఐర్లాండ్ తరఫున సిమీ అరగేట్రం చేశాడు. స్పిన్నర్ అయిన అతడు ఇప్పటివరకూ 35 వన్డేలు, 53 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.